'బ్లింక్' (ఆహా) మూవీ రివ్యూ!
Movie Name: Blink
- కన్నడలో రూపొందిన 'బ్లింక్'
- సైన్స్ ఫిక్షన్ జోనర్లో సాగే సినిమా
- రీసెంటుగా 'ఆహా'లో మొదలైన స్ట్రీమింగ్
- ఆసక్తికరంగా నడిచే కథాకథనాలు
కన్నడలో ఈ ఏడాది మార్చిలో వచ్చిన 'బ్లింక్' సినిమా గురించి చాలామంది మాట్లాడుకున్నారు. దీక్షిత్ శెట్టి ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, సైన్స్ ఫిక్షన్ జోనర్లో రూపొందింది. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా, రీసెంటుగా 'ఆహా' ఫ్లాట్ ఫామ్ పైకి అడుగుపెట్టింది. శ్రీనిధి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, ప్రసన్న కుమార్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
అపూర్వ (దీక్షిత్ శెట్టి) ఓ సాధారణ కుటుంబానికి చెందిన యువకుడు. అతని గురించి ఆలోచించడానికి తల్లి 'యశోద' మాత్రమే ఉంటుంది. తన చిన్నప్పుడే తన తండ్రి ఇల్లొదిలి వెళ్లిపోయాడనే ఒక విషయం మాత్రమే అపూర్వకి తెలుసు. మిగతా విషయాలు అతనికి తెలియదు. సరైన ఉద్యోగం కోసం అతను కొన్ని రోజులుగా ప్రయత్నిస్తూ ఉంటాడు. అతను .. స్వప్న కొంతకాలంగా ప్రేమలో ఉంటారు.
తనని ఓ నడి వయస్కుడు తరచూ ఫాలో అవుతూ ఉండటం అపూర్వకి సందేహాన్ని కలిగిస్తుంది. ఇక అచ్చు తన మాదిరిగానే ఉన్న వ్యక్తి అప్పుడప్పుడు తారసపడుతూ ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ విషయాన్ని స్నేహితులతో చెప్పినప్పటికీ వాళ్లు సరదాగా తీసుకుంటారు. అదే సమయంలో మళ్లీ ఆ నడి వయసు వ్యక్తి కలుస్తాడు. తనని ఎందుకు ఫాలో అవుతున్నది చెప్పమని ఆ వ్యక్తిని అపూర్వ నిలదీస్తాడు.
అప్పుడు ఆ వ్యక్తి కాలంలో వెనక్కి వెళ్లే ఒక పద్ధతిని తాను కనుక్కున్నానని చెబుతాడు. ఒక వాచ్ ఇచ్చి దాంట్లో డేట్ .. టైమ్ .. వెళ్లవలసిన సంవత్సరం సెట్ చేసుకోమని చెబుతాడు. ఆ తరువాత తాను ఇచ్చిన డ్రాప్స్ ను రెండుకళ్లలో వేసుకుంటే .. ఆ కాలానికి వెళ్లిపోవచ్చని అంటాడు. అయితే రెప్ప కొట్టనంత వరకే ఆ టైమ్ లైన్లో ఉండొచ్చని చెబుతాడు. అతను రెప్ప వేయకుండా అరగంట వరకూ ఉండగలడని తెలియడంతోనే తాను ఫాలో అయ్యానని అంటాడు.
ఆ మాటలు వినగానే అపూర్వ షాక్ అవుతాడు. తాను చెప్పినట్టుగా చేస్తే అతనికి 10 లక్షలు ఇస్తాననీ, కాలంలో వెనక్కి వెళ్లడం వలన అతని తండ్రిని కలుసుకోవచ్చనీ, అతని గురించి తెలుసుకోవచ్చని ఆ వ్యక్తి అంటాడు. తన తండ్రి ఏమైపోయాడో తెలుసుకోవడం కోసం అపూర్వ అంగీకరిస్తాడు. ఫలితంగా ఏం జరుగుతుంది? అతని తండ్రి ఏమైపోతాడు? అది తెలుసుకున్న అపూర్వ ఏం చేస్తాడు? అతని గతం ఎలాంటిది? ఆ నడి వయసు వ్యక్తి ఎవరు? అనేది మిగతా కథ.
ఈ కథ 1996 నుంచి 2054 వరకూ వెళుతుంది. 2054వ సంవత్సరాన్ని నామ మాత్రంగా టచ్ చేసినప్పటికీ, కథలో చాలా భాగం 1996- 2021 మధ్య కాలంలో నడుస్తుంది. కథ ఎక్కువగా అరడజను పాత్రల చుట్టూ తిరుగుతుంది. తక్కువ పాత్రలతో .. తక్కువ లొకేషన్స్ లో కథ తిరుగుతున్నప్పటికీ ఎక్కడా బోర్ అనిపించదు. ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తూ ముందుకు వెళుతుంది. కాలాల మధ్య తేడా కూడా కుతూహలాన్ని పెంచుతుంది.
నిజానికి ఇది చాలా క్లిష్టతరమైన స్క్రీన్ ప్లేతో కూడిన కథ. గతానికి .. వర్తమానానికి సంబంధించిన సన్నివేశాలు మాటిమాటికి మారిపోతూ ఉంటాయి. అందువలన సాధారణ ప్రేక్షకులకు కొంత అయోమయాన్ని కలిగిస్తుంది. చాలా కథ నడిచిన తరువాతనే అసలు విషయం ఏమిటనేది అర్థమవుతుంది. చివరికి కూడా కొన్ని అనుమానాలు .. సందేహాలు వాళ్లలో అలాగే ఉంటాయి. కొన్ని లాజిక్కుకు అందకపోయినా, కంటెంట్ బాగానే ఉందే అనిపిస్తుంది.
దీక్షిత్ శెట్టి .. చైత్ర ఆచార్ .. మందార .. గోపాలకృష్ణ నటన ఈ సినిమాకి హైలైట్ అనే చెప్పాలి. చైత్ర ఆచార్ పాత్ర కథను ఆడియన్స్ కి మరింత బలంగా కనెక్ట్ చేస్తుంది. టైమ్ ట్రావెల్ కథను పెద్దగా హడావిడి లేకుండా .. ఖర్చు లేకుండా దర్శకుడు డిజైన్ చేసుకున్న తీరు బాగుంది. టైమ్ ట్రావెల్ కి సంబంధించిన సన్నివేశాలు .. లొకేషన్స్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. వేరు వేరుగా ప్రయాణించే పాత్రలను కనెక్ట్ చేసిన విధానం మెప్పిస్తుంది. ట్విస్టులు ఆకట్టుకుంటాయి.
అవినాశ్ శాస్త్రి కెమెరా పనితనం బాగుంది. వేరు వేరు కాలాలను తెరపై ఆవిష్కరించడంలో ఆయన ముఖ్యమైన పాత్రను పోషించాడు. ప్రసన్న కుమార్ నేపథ్య సంగీతం సందర్భానుసారంగా సాగింది. సంజీవ్ ఎడిటింగ్ కూడా, కాలాల విషయంలో కన్ఫ్యూజన్ లేకుండా మెప్పిస్తుంది. తక్కువ బడ్జెట్ లో ఒక బలమైన కంటెంట్ ను చెప్పగలగడం నిజంగా విశేషమే.
సాధారణంగా టైమ్ మిషన్ తో గతంలోకి వెళ్లాలనీ .. కొన్ని పొరపాట్లు సరిచేసుకోవాలనీ .. కొన్ని తప్పులు దిద్దుకోవాలనీ .. కొన్ని నిజాలు తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. ఆ కుతూహలాన్ని పెంచుతూ అల్లిన కారణంగానే ఈ కథ వెంటనే కనెక్ట్ అవుతుంది. హీరోతో పాటు గతంలోకి వెళుతూ .. వర్తమానంలోకి తిరిగిస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అందువల్లనే థియేటర్స్ లోనే కాదు. ఓటీటీ వైపు నుంచి కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది.