'వీరాంజనేయులు విహారయాత్ర' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ !
Movie Name: Veeranjaneyulu Vihara Yatra
- సరదాగా సాగిపోయే 'వీరాంజనేయులు విహారయాత్ర'
- ప్రత్యేకమైన పాత్రలో కనిపించిన బ్రహ్మానందం
- ఆకట్టుకునే కథాకథనాలు
- సహజత్వానికి దగ్గరగా ఆవిష్కరించిన సన్నివేశాలు
- ఫ్యామిలీతో కలిసి సరదాగా చూడదగిన సినిమా
ఈ మధ్య కాలంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పై థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన కంటెంట్ ఎక్కువగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఫ్యామిలీ కంటెంట్ ను అందించడానికి ఈటీవీ విన్ ఉత్సాహాన్ని చూపిస్తోంది. ఆ ప్రయత్నంలో భాగంగా వచ్చిందే 'వీరాంజనేయులు విహారయాత్ర'. నరేశ్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, ఈ రోజు నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. బాపినీడు - సుధీర్ ఈదర నిర్మించిన ఈ సినిమాకి, అనురాగ్ పాలుట్ల దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
వీరాంజనేయులు (బ్రహ్మానందం) రైల్వే ఉద్యోగి. పదవీ విరమణ చేసిన తరువాత వచ్చిన డబ్బుతో 'గోవా'లో ఒక ఇంటిని కొనుగోలు చేస్తాడు. ఆ ఇంటికి 'హ్యాపీ హోమ్' అనే పేరు పెడతాడు. గోవా అంటే ఆయనకి ఇష్టం .. ఆ ఇల్లంటే ఆయనకి ప్రాణం. ఆయన కొడుకు నాగేశ్వరరావు (నరేశ్) - కోడలు సావిత్రి వైజాగ్ లో స్థిరపడతారు. వారి సంతానమే వీరూ (రాగ్ మయూర్) కూతురు సరయూ (ప్రయా వడ్లమాని). వీరాంజనేయులు భార్య కాంతం (శ్రీలక్ష్మి) కొడుకు దగ్గరే ఉంటుంది.
నాగేశ్వరరావు ఒక స్కూల్లో టీచర్ గా పనిచేస్తూ ఉంటాడు. అతని కొడుకు వీరూ హైదరాబాద్ లో ఒక స్టార్ట్ అప్ కంపెనీకి సంబంధించిన ప్రయత్నాల్లో ఉంటాడు. అతను జాబ్ మానేసి సొంత ప్రయత్నాల్లో ఉన్నాడనే విషయం తండ్రికి తెలియదు. శ్రీమంతుల కూతురైన ఐశ్వర్య అతణ్ణి ప్రేమిస్తూ ఉంటుంది. ఇక సరయూ విషయానికి వస్తే, ఆమె .. తరుణ్ ప్రేమించుకుంటారు. అతను ధనవంతుల బిడ్డ. వాళ్ల పెళ్లికి ఇరు కుటుంబాలవారు ఒప్పుకుంటారు. అయితే పెళ్లి గ్రాండుగా చేయాలనే ఒక షరతు పెడతారు. దాంతో నాగేశ్వరరావు ఆలోచనలో పడతాడు.
ఈ జనరేషన్ పిల్లలకు నాగేశ్వరావు చెప్పలేకపోతున్నాడనే ఉద్దేశంతో, స్కూల్ యాజమాన్యం ఆయనను ఉద్యోగంలో నుంచి తొలగిస్తుంది. కానీ ఆ విషయాన్ని అతను మనసులోనే దాచుకుని, వెరే ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటాడు. గోవాలో ఉన్న ఇంటికి అమ్మేసి ఆ డబ్బుతో కూతురు పెళ్లి చేయాలనుకుంటాడు. అందుకు సంబంధించిన ప్రయత్నాలు చేసేస్తాడు. రిజిస్ట్రేషన్ కి అందరి సంతకాలు అవసరమనడంతో అసలు సంగతి వారికి చెప్పకుండా అతను ఒక ప్లాన్ వేస్తాడు.
తండ్రి అస్థికలు 'గోవా' సముద్రంలో కలిపేసి .. 'హ్యాపీ హోమ్'లో ఒక రోజు హాయిగా గడిపేసి తిరిగి వద్దామని అందరినీ బయల్దేరదీస్తాడు. 'వీరాంజనేయులు' గతంలో వాడిన పాత వ్యానులో ప్రయాణమవుతారు. తన భర్తకి ఎంతో ఇష్టమైన గోవా ఇంట్లో తన చివరి రోజులు గడపాలనేది కాంతం చివరి కోరిక. పెళ్లి తరువాత ఆ ఇంట్లో ఉంటూ బిజినెస్ ప్లాన్స్ చేసుకోవాలనేది సరయూ ఆలోచన.
సరయూ గర్భవతి అయిందనే విషయం .. వీరూ జాబ్ మానేసిన విషయం ఆ ప్రయాణంలోనే నాగేశ్వరరావుకి తెలుస్తుంది. అతను 'గోవా'లోని ఇంటిని అమ్మేసే ఆలోచనలో ఉన్నాడనే విషయం కూడా అప్పుడే మిగతా వాళ్లకి తెలుస్తుంది. అప్పుడు వాళ్లంతా ఎలా స్పందిస్తారు? 'గోవా'లోని ఇంటిని అమ్మేయడానికి వాళ్లు ఒప్పుకుంటారా? సరయూ పెళ్లి తరుణ్ తో జరుగుతుందా? వీరూ ప్రాజెక్టు సక్సెస్ అవుతుందా? కాంతం చివరి కోరిక నెరవేరుతుందా? అనేది మిగతా కథ.
ఈ కథాకథనాలను దర్శకుడే తయారు చేసుకున్నాడు. చాలా సాధారణంగా .. సహజంగా .. సరదాగా ఈ కథను మొదలుపెట్టిన దర్శకుడు, బలమైన ఎమోషన్స్ ను టచ్ చేస్తూ వెళ్లాడు. వీరాంజనేయులు ఎంతో ముచ్చటపడి కొనుక్కున్న వ్యానులో .. అతను ఎంతో కష్టపడి 'గోవా'లో కొనుక్కున్న ఇంటికి వెళ్లడమే ఈ కథ. అతని అస్థికలతోనే కాదు .. తమ ఆశలు .. ఆశయాలతో జరిగే ఈ ప్రయాణం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
దారి పొడవునా ఈ కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయతలు .. అనురాగాలు ఉంటాయి. అలకలు - బుజ్జగింపులు ఉంటాయి. ఆవేశాలు .. ఆవేదనలు చోటుచేసుకుంటాయి. అలా అనేక ఎమోషన్స్ తో ఈ ప్రయాణం సాగుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఎమోషన్స్ లో నుంచి బయటికి తీసుకువచ్చే ప్రయత్నాన్ని కామెడీ చేస్తూనే ఉంటుంది.
వీరాంజనేయులు ఫ్యామిలీ ప్రయాణించే వ్యానులోను ప్రతి ప్రేక్షకుడు చేరిపోతాడు. వారి భావోద్వేగాలను పంచుకుంటూ ముందుకు సాగుతాడు. అంత సహజంగా దర్శకుడు మొదటి నుంచి చివరివరకూ ఈ కథను .. పాత్రలను నడిపించాడు. వ్యాను ప్రయాణించే లొకేషన్స్ ఈ కథకు కావలసినంత ఆహ్లాదాన్ని జోడిస్తాయి. 'ఇంకా ఎంతకాలం బతుకుతానో ఏమో' అనే మేనరిజంతో శ్రీలక్ష్మి ఈ సినిమాకి నిండుదనాన్ని తీసుకొచ్చింది. ప్రత్యేకమైన పాత్రను పోషించిన బ్రహ్మానందంతో సహా ఎవరి పాత్రకు వారు జీవం పోశారు.
కథాకథనాలతో పాటు, విక్రమ్ నేపథ్య సంగీతం .. అంకుర్ ఫొటోగ్రఫీ ఆకట్టుకుంటాయి. కుటుంబంలో ఎవరి సమస్యను వారే ఫేస్ చేస్తే అది ప్రపంచమంత పెద్దదిగా కనిపిస్తుంది. అదే అందరూ కలిసి ఆలోచిస్తే అది కర్పూరంలా కరిగిపోతుంది. కుటుంబానికి బంధాలే బలం .. ఆ బలంతో ఎంతటి సమస్యనైనా ఎదుర్కోవచ్చు .. హ్యాపీగా జీవించవచ్చు అనే సందేశం కూడా ఈ కథలో కనిపిస్తుంది. వినోదానికి సందేశాన్ని జోడిస్తూ చెప్పడంతో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఫ్యామిలీ అంతా కూర్చుని సరదాగా చూసే సినిమా ఇది.