ఒకానొక సమయంలో కరీనా కపూర్ బాలీవుడ్ ను ఒక ఊపు ఊపేసింది. అప్పటి స్టార్ హీరోయిన్స్ కి ఆమె గట్టిపోటీ ఇచ్చింది. అలాంటి కరీనా ప్రధానమైన పాత్రగా మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో 'జానే జాన్' సినిమా రూపొందింది. జైదీప్ అహ్లావత్ ... విజయ్ వర్మ .. సౌరభ్ సచ్ దేవా ముఖ్యమైన పాత్రలను పోషించారు. సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, నిన్నటి నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది. షోర్ పోలీస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను సమకూర్చిన ఈ సినిమా, ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
'కలింపాంగ్'లో మాయ డిసౌజా (కరీనా కపూర్) తన కూతురు 'తార'తో కలిసి నివసిస్తూ ఉంటుంది. కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఆమె ఒక హోటల్లో పనిచేస్తూ ఉంటుంది. తార టీనేజ్ లోకి అడుగుపెట్టడం వలన, ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. అదే బంగళాలో మరో పోర్షన్ లో ఉండే నరేన్ (జైదీప్ అహ్లావత్) వాళ్లను చాలా దగ్గరగా పరిశీలిస్తూ ఉంటాడు. 'మాయ'ను తను మౌనంగా ఆరాధిస్తూ ఉంటాడు.
ఒక కేసు విషయంలో అజిత్ మాత్రే (సౌరభ్ సచ్ దేవా) ను పట్టుకునే బాధ్యత, పోలీస్ ఆఫీసర్ కర్ణన్ (విజయ్ వర్మ) కు అప్పగించబడుతుంది. దాంతో అతను అజిత్ మాత్రే మూలలను పట్టుకుంటూ, తగిన ఆధారాలను సేకరిస్తూ ముందుకు వెళుతూ ఉంటాడు. అతని కోసం కర్ణన్ వెదుకుతూ ఉంటే, అతను 'మాయ'ను వెతుక్కుంటూ 'కలింపాంగ్' వస్తాడు. అతను తన అడ్రెస్ తెలుసుకుని అక్కడి వరకూ వస్తాడని ఊహించని 'మాయ' బిత్తరపోతుంది.
అజిత్ కి కొంత డబ్బు ఇచ్చి పంపించేయాలని అనుకుంటుంది. కానీ అక్కడి నుంచి వెళ్లడానికి అతను నిరాకరిస్తాడు. తాను మారిపోయాననీ .. ఇకపై అందరం కలిసి ఉందామని అంటాడు. పోలీస్ జాబ్ ను .. సైడ్ బిజినెస్ లను మానేస్తానని నమ్మకంగా చెబుతాడు. అతను తనకి కావలసిన డబ్బు కోసం 'తార' భవిష్యత్తును తాకట్టు పెట్టే ఆలోచనలో ఉన్నాడని తెలుసుకున్న మాయ, కోపంతో రగిలిపోతుంది. వాళ్ల ఘర్షణలో తార జోక్యం చేసుకోవడంతో అది మరింత ముదిరిపోతుంది.
అజిత్ నుంచి తారను రక్షించుకునే క్రమంలో మాయ అతణ్ణి చంపేస్తుంది. ఆ తరువాత భయపడిపోతుంది. పోలీసులకు నిజం చెప్పి లొంగిపోవాలని భావిస్తుంది. అలా చేస్తే తార భవిష్యత్తు ఏమిటి? అనే ఆలోచన రావడంతో తన నిర్ణయాన్ని మార్చుకుంటుంది. పక్క పోర్షన్ లో నుంచి నరేన్ ఇదంతా గమనిస్తాడు. శవాన్ని ఎలా వదిలించుకోవాలా అని మాయ ఆలోచన చేస్తుండగా వచ్చి, ఈ విషయంలో తాను సాయం చేస్తానని ధైర్యం చెబుతాడు. వాళ్లిద్దరూ కలిసి ఆ శవాన్ని ఏం చేస్తారు? ఎంత వరకూ ఆ నిజాన్ని దాచగలుగుతారు? అజిత్ కోసం బయల్దేరిన కర్ణన్, మాయ వరకూ వస్తాడా? అనేవి ఆసక్తిని రేకెత్తించే మిగతా అంశాలు.
దర్శకుడు సుజోయ్ ఘోష్ ఈ కథను చాలా పట్టుగా .. పకడ్బందీగా తయారు చేసుకున్నాడు. కథను చాలా తక్కువ పరిధిలో .. తక్కువ పాత్రలతో ఇంట్రెస్టింగ్ గా అల్లుకున్నాడు. మాయ .. ఆమె మాజీ భర్త .. ఆమెను మౌనంగా ఆరాధించే ఒక టీచర్ .. మాయ భర్తను పట్టుకోవడానికి బయల్దేరిన ఒక పోలీస్ ఆఫీసర్ .. కథ అంతా కూడా ఈ నాలుగు పాత్రల చుట్టూనే తిరుగుతుంది.పెద్దగా సమయం తీసుకోకుండా ఈ నాలుగు పాత్రలను పరిచయం చేసిన తీరు బాగుంది.
ప్రధానమైన ఈ నాలుగు పాత్రల స్వరూప స్వభావాలను దర్శకుడు డిజైన్ చేసుకున్న తీరు ఆకట్టుకుంటుంది. భర్త దుర్మార్గుడు అయినప్పుడు అతని నీడను కూడా తన కూతురు పై పడకుండా చూసుకునే తల్లిగా కరీనా కపూర్ .. డబ్బు కోసం భార్యను మాత్రమే కాదు .. కూతురును కూడా ఉపయోగించుకోవాలనుకున్న ఓ తండ్రి .. తాను ఒంటరి .. ఒంటరిగా ఉంటున్న మాయను ఆరాధించడంలో తప్పు లేదని భావించే ఒక టీచర్ .. మాయ భర్తను పట్టుకోవడానికి రంగంలోకి దిగిన ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రను ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంటుంది.
అయితే ఈ కథ .. విచారణ పరంగా తీసుకుంటున్న మలుపులు చూస్తున్నప్పుడు ఏ క్షణంలోనైనా మాయ అరెస్టు కావడం ఖాయమని అనిపిస్తూ ఉంటుంది. కానీ దర్శకుడు అక్కడే పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. అదేమిటనేది ఈ సినిమాను చూస్తూ తెలుసుకుంటేనే థ్రిల్ ఉంటుంది.
ఈ నాలుగు పాత్రలలో ఆర్టిస్టులు చాలా సహజంగా ఒదిగిపోయారు. తన కూతురును కాపాడుకోవడమే తనముందున్న లక్ష్యం అనే స్థాయిలో కరీనా పలికించిన ఆవేశం .. ఆవేదన ... ఆక్రోశం ఆమె నటనా పటిమకు అద్దం పడతాయి. ఈ సినిమాకి ఆమె నటనే హైలైట్. వ్యసనపరుడైన భర్తగా ... బాధ్యత లేని తండ్రిగా సౌరభ్ సచ్ దేవా నటన కూడా ఆకట్టుకుంటుంది. ఇక పోలీస్ ఆఫీసర్ గా విజయ్ వర్మ నటనకి కూడా మంచి మార్కులు పడతాయి. జైదీప్ అహ్లావత్ పాత్రను డిజైన్ చేసిన తీరు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది.
షోర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. అవిక్ ముఖోపా ధ్యాయ్ కెమెరా పనితనం చాలా నేచురల్ గా అనిపిస్తుంది. ఊర్వశి సక్సేనా ఎడిటింగ్ కి వంక బెట్టవలసిన అవసరం లేదు. ఎక్కడా అనవసరమైన సీన్స్ కనిపించవు. కథ విషయాన్ని అలా ఉంచితే, స్క్రీన్ ప్లే పరంగా 'దృశ్యం' సినిమా ప్రేక్షకులకు గుర్తుకు వస్తుంది. ఈ మధ్య కాలంలో తక్కువ బడ్జెట్ లో .. తక్కువ పాత్రలతో ఆద్యంతం ఆసక్తికరంగా అనిపించిన సినిమాలలో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు.
'జానే జాన్' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ
Jaane Jaan Review
- కరీనా కపూర్ ప్రధానమైన పాత్రగా 'జానే జాన్'
- మిస్టరీ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ
- 'దృశ్యం' సినిమాను గుర్తుకు చేసే కథనం
- నాలుగు ప్రధాన పాత్రలతో కథను నడిపించిన డైరెక్టర్
- కరీనా నటనయే ఈ సినిమాకి హైలైట్
Movie Details
Movie Name: Jaane Jaan
Release Date: 2023-09-21
Cast: Kareena Kapoor, Jaideep Ahlawat, Vijay Varma, Saurabh Sachdeva, Naisha Khanna
Director: Sujoy Ghosh
Music: Shor Police
Banner: Balaji Motion Pictures -12th Street Entertainment
Review By: Peddinti
Trailer