మూవీ రివ్యూ: 'ఊర్వశివో రాక్షసీవో'

Urvasivo Rakshasivo

Movie Name: Urvasivo Rakshasivo

Release Date: 2022-11-04
Cast: Allu Sirish, Anu Emmanuel, Sunill, Vennela Kishore, Aamani
Director:Rakesh Sashi
Producer: Dheeraj Mogilineni
Music: Achu Rajamani
Banner: Sri Thirumala Production
Rating: 3.50 out of 5
  • నేడే విడుదలైన 'ఊర్వశివో రాక్షసివో'
  • రొమాంటిక్ కామెడీ జోనర్లో నడిచిన కథ 
  • ఆసక్తికరమైన కథనం ప్రధానమైన ఆకర్షణ 
  • మరింత గ్లామరస్ గా మెప్పించిన అనూ ఇమ్మాన్యుయేల్ 
  •  చాలా గ్యాప్ తరువాత అల్లు శిరీష్ కి హిట్ పడినట్టే

అల్లు శిరీష్ - అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా 'ఊర్వశివో రాక్షసివో' సినిమా రూపొందింది. తమ్మారెడ్డి భరద్వాజ .. ధీరజ్ మొగిలినేని .. విజయ్ నిర్మించిన ఈ సినిమాకి రాకేశ్ శశి దర్శకత్వం వహించాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టయినర్ జోనర్లో నిర్మితమైన ఈ సినిమా, ఈ శుక్రవారమే థియేటర్లకు వచ్చింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ వారు సమర్పించిన ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతవరకూ కనెక్ట్ అయిందనేది ఇప్పుడు చూద్దాం. 

ఒక అమ్మాయికీ .. అబ్బాయికి మధ్య అభిప్రాయాలు .. అభిరుచులు .. అలవాట్లు కలిసినప్పుడే స్నేహం ఏర్పడుతుంది. ఆ స్నేహం ప్రేమగా పరిణతి చెంది పెళ్లి పీటలవరకూ వెళుతుంది. అలా కాకుండా తమ భావాలు ... ఆశలు .. ఆశయాలు వేరైన ఒక అమ్మాయి .. అబ్బాయి కలిసి జీవితాన్ని కొనసాగించాలనుకుంటే, ఆ ఇద్దరూ కూడా ఒకరి దారిలోకి మరొకరిని తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచనకి దృశ్య రూపమే 'ఊర్వశివో రాక్షసివో' సినిమా. 

కథలోకి అడుగుపెడితే .. శ్రీకుమార్ (అల్లు శిరీష్) .. సింధు (అనూ ఇమ్మాన్యుయేల్) ఒక కార్పొరేట్ ఆఫీసులో పనిచేస్తూ ఉంటారు. శ్రీకుమార్ మధ్యతరగతి కుటుంబానికి చెందిన కుర్రాడు. అతని తల్లిదండ్రులు (ఆమని - కేదార్ శంకర్)  తమకి నచ్చిన పద్ధతి కలిగిన అమ్మాయినే కోడలిగా తీసుకురావాలనే ఆలోచనలో ఉంటారు. ఇక సింధు అమెరికాలో పుట్టి ఆధునిక భావాలతో పెరిగిన అమ్మాయి. తనకి పెళ్లి .. పిల్లలు అనే మాటలు నచ్చవు. ఎందుకంటే రెస్టారెంట్ బిజినెస్ ను సొంతంగా పెట్టడమే ఆమె ఆశయం. అందుకు పెళ్లి ప్రతిబంధకమని ఆమె భావిస్తుంటుంది. 

అలాంటి నాయకా నాయికలు దగ్గరవుతారు. నిదానంగా అతణ్ణి తన దారికి తెచ్చుకోవాలనే ఉద్దేశంతో సింధు, ఆమెతో ఉంటూనే పెళ్లికి ఒప్పించవచ్చని శ్రీకుమార్ సహజీవనానికి ఒప్పుకుంటారు. వీరి ప్రేమ విషయం తెలిసిన శ్రీకుమార్ ఫ్రెండ్ సతీష్ (వెన్నెల కిశోర్) శ్రీకుమార్ మేనమామ చిట్టిబాబు (సునీల్)వీరి సహజీవనానికి సహకరిస్తారు. తన తల్లిదండ్రులకు ఈ విషయం తెలియకుండా ఉండటం కోసం .. రెండు వైపులా మేనేజ్ చేయడం కోసం శ్రీకుమార్ నానా తంటాలు పడుతుంటాడు. అలాంటి పరిస్థితుల్లోనే ఒక అనూహ్యమైన సంఘటన జరుగుతుంది. అదేమిటి? ఆ సంఘటన పర్యవసానాలు ఎలాంటివి? ఇద్దరిలో ఎవరి అభిప్రాయాన్ని ఎవరు  మార్చగలిగారు? అనేదే కథ. 

 కథగా చెప్పుకుంటే ఒక పేరాకి మించి చెప్పనవసరం లేని సబ్జెక్ట్ ఇది. కానీ ఆ కాస్తలోనే విషయం ఉంది. దర్శకుడు రాకేశ్ శశి ఈ కథను ఆసక్తికరమైన కథనంతో ముందుకు నడిపించాడు. హీరో హీరోయిన్ల స్వభావం విషయంలో ఆడియన్స్ కి ఒక క్లారిటీ ఇవ్వడంలోను, ప్రధానమైన పాత్రలను డిజైన్ చేసే విషయంలోను , ఏ పాత్రను ఎంతవరకూ తీసుకుని వెళ్లాలనే విషయంలోను ఆయన సక్సెస్ అయ్యాడు. అలాగే రొమాన్స్ .. కామెడీ .. ఎమోషన్ మధ్య ఎక్కడా లింకులు తెగిపోకుండా చూసుకోవడంలోనూ మంచి ప్రతిభను కనబరిచాడు. 

కలిసుండాలంటే పెళ్లి చేసుకోవలసిన అవసరం లేదు అనే ప్రియరాలి ఆలోచనకీ, పెళ్లి చేసుకుని కలిసుండాలనే తన తల్లి ఆశకి మధ్య హీరో నలిగిపోయిన తీరును చూపించిన విధానం ఆడియన్స్ ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్ సమక్షంలో హీరో మరో అమ్మాయిని పెళ్లి చూపులు చూసే సీన్ .. హీరోయిన్ ఇంట్లో తన తండ్రికి కనిపించకుండా హీరో దాక్కునే సీన్ .. హీరో హీరోయిన్ తీరుపై సునీల్ - వెన్నెల కిశోర్ క్రికెట్ కామెంట్రీ తరహాలో చెప్పడం .. పెళ్లిళ్ల బ్రోకర్ గా శిరీష్ ఇంటికి పోసాని రావడం వంటి సీన్స్ నాన్ స్టాప్ గా నవ్విస్తాయి. 

అల్లు శిరీష్ విషయానికొస్తే ఇంతకుముందు కంటే ఈ సినిమాలో అతని నటనలో కాస్త పరిణతి కనిపిస్తుంది. ఇక ఈ సినిమాకి అనూ ఇమ్మాన్యుయేల్ గ్లామర్ .. ఆమె నటన హైలైట్ గా నిలిచాయని చెప్పచ్చు. కళ్లతోనే ఆమె పలికించిన హావభావాలు కుర్రాళ్లను కట్టిపడేస్తాయి. కామెడీ పరంగా చూసుకుంటే, ఒక వైపున సునీల్ .. మరో వైపున వెన్నెల కిశోర్ ఈ కథా రథానికి రెండు చక్రాల్లా కనిపిస్తారు. ఇద్దరూ కూడా తమదైన మార్కును చూపించారు. 

అచ్చు రాజమణి బాణీలు .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకున్నాయి. అనూప్ రూబెన్స్ స్వరపరిచిన 'మాయారే' సాంగ్ యూత్ తో పాటు మాస్ కి కూడా కనెక్ట్ అవుతుంది. తన్వీర్ మీర్ కెమెరా పనితనం బాగుంది. హీరో .. హీరోయిన్లను మరింత గ్లామర్ గా చూపించడమే కాకుండా, పాటలకు ప్రత్యేకమైన ఆకర్షణ తీసుకొచ్చాడు. ఎడిటింగ్ వర్క్ కూడా చాలా నీట్ ఉంది. 

తెరపై కథ మొదలైన దగ్గర నుంచి .. చివరివరకూ బోర్ కొట్టకుండా నడిపిస్తూ ఇంటర్వెల్ బ్యాంగ్ కి కథను ఒక రేంజ్ లోకి తీసుకుని వెళ్లడం .. ఆ తరువాత ఏ మాత్రం టెంపో తగ్గకుండా క్లైమాక్స్ దిశగా తీసుకెళ్లిన తీరు ఆడియన్స్ ను మెప్పిస్తుంది. కొంతకాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న శిరీష్ కి ఈ సినిమాతో హిట్ పడినట్టే. అలాగే వరుస ఫ్లాపులతో ఉన్న అనూ ఇమ్మాన్యుయేల్ కి కూడా ఈ సినిమా ఊరట కలిగిస్తుందనే చెప్పాలి.

Trailer

More Reviews