ఈ మధ్య కాలంలో రొమాంటిక్ కామెడీని టచ్ చేస్తూ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్లో చాలానే సినిమాలు వచ్చాయి. అప్పుడు అదే జోనర్ ను టచ్ చేస్తూ వచ్చిన సినిమానే 'కృష్ణ వ్రింద విహారి'. నాగశౌర్య - షెర్లీ సెటియా జంటగా నటించిన ఈ సినిమాలో రాధిక కీలకమైన పాత్రను పోషించింది. ఐరా క్రియేషన్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి అనీష్ కృష్ణ దర్శకత్వం వహించాడు. మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, ఈ శుక్రవారమే థియేటర్లకు వచ్చింది. యూత్ ను .. ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసుకుని వచ్చిన ఈ సినిమా, ఏ మేరకు వారిని ఆకట్టుకుందనేది ఇప్పుడు చూద్దాం.
కృష్ణాచారి (నాగశౌర్య) 'గోపవరం' అగ్రహారానికి చెందిన యువకుడు. ఆ అగ్రహారంలో అమృతవల్లి (రాధిక)కి మంచి పేరు ఉంటుంది. ఆమె మాటను కాదనేవారు అక్కడ దాదాపుగా ఉండరు. ఆచార వ్యవహారాలకు .. సంప్రదాయానికి ఆమె ప్రాణం ఇస్తుంది. అలాగే తన కొడుకైన కృష్ణాచారిని పద్ధతిగా పెంచుతుంది. హైదరాబాదులని ఓ ఐటీ కంపెనీలో జాబ్ రావడంతో, గోపవరం నుంచి కృష్ణాచారి వచ్చేస్తాడు. తొలి చూపులోనే తన టీమ్ లీడర్ అయిన 'వ్రింద'పై మనసు పారేసుకుంటాడు. ఆల్రెడీ ఆమె వెంటపడుతున్న ప్రాజెక్టు మేనేజర్ నందన్ (అమితాష్ ప్రధాన్)కి శత్రువుగా మారతాడు.
నందన్ బారి నుంచి తప్పించుకోవడానికి కృష్ణ వైపు మొగ్గు చూపిన వ్రింద, నిజంగానే అతనితో ప్రేమలో పడుతుంది. అయితే పెళ్లి పట్ల అనాసక్తిని చూపుతుంది. తనకి గల అనారోగ్యం కారణంగా తనకి పిల్లలు పుట్టే ఛాన్స్ లేదని చెబుతుంది. అయినా ఆమెను పెళ్లి చేసుకోవడానికి తాను సిద్ధంగానే ఉన్నానని కృష్ణ అంటాడు. కాబోయే కోడలికి ఆడపిల్ల పుట్టాలని ఆశతో తల్లి ఎంతగానో ఎదురు చూస్తోందనే విషయం కృష్ణకి తెలుసు. అందుకోసమే అనుకోకుండా జరిగిన ఒక ప్రమాదం కారణంగా, తనకి పిల్లలు పుట్టే అవకాశం లేకుండా పోయిందని తల్లితో అబద్ధం చెబుతాడు.
ఇంత లోపం ఉన్న కారణంగా తన కొడుక్కి ఇక పెళ్లి కాదేమోననే బెంగతో కృష్ణ - వ్రింద పెళ్లికి అమృతవల్లి ఒప్పుకుంటుంది. తన గురించిన నిజాన్ని అమృతవల్లికి కృష్ణ చెప్పాడని వ్రింద భావిస్తుంది. కృష్ణ తనలోనే లోపం ఉందని చెప్పినట్టుగా ఆమెకి తెలియదు. ఒక శుభ ముహూర్తాన ఆమె వివాహం కృష్ణతో జరుగుతుంది. కృష్ణ ఆడిన అబద్ధం ఎలాంటి పరిణామాలకి దారితీస్తుంది? ఒక అబద్ధాన్ని అబద్ధమని నిరూపించడానికి ఆయన ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చింది? అనేదే కథ.
కథ విషయానికి వస్తే చాలా రొటీన్ అనే చెప్పాలి. ఇలాంటి కథలు ఇంతకుముందు చాలానే వచ్చాయి. ఎక్కడిదాకో ఎందుకూ .. నిన్నగాక మొన్న వచ్చిన 'అంటే .. సుందరానికీ' కూడా కాస్త అటు ఇటుగా ఇదే తరహాలో సాగుతుంది. కులం విషయమో .. సంపద విషయంలోనో .. సంతానం విషయంలోనో ఉన్న లోపాలను పేరెంట్స్ దగ్గర దాచడానికి ప్రయత్నించి పడిన ఇబ్బందుల తాలూకు కథలు ప్రేక్షకులు చూసి చూసి ఉన్నారు. ఇక కథనం విషయంలో కూడా 'అబ్బో' అనిపించే మేజిక్కులేం జరగవు. ఏం జరగబోతుందన్నది ముందుగానే తెలిసిపోతుంటుంది.
పాత్రలను మలిచే విధానం విషయానికి వస్తే, ఉన్నవి పరిమితమైన పాత్రలే. వాటి విషయంలో దర్శకుడు క్లారిటీతోనే ఉన్నాడు. కథలో నుంచి కాస్త కామెడీని .. కాస్త రొమాన్స్ ను పొదుపుగా ఖర్చు చేస్తూ, ఎమోషనల్ టచ్ ఎక్కువగా ఇవ్వడానికి ప్రయత్నించాడు. ఫస్టాఫ్ లో మందగించిన కథ నడక .. సెకండాఫ్ లో కాస్త పుంజుకుంటుంది. కానీ ఆ స్పీడ్ సరిపోక ప్రేక్షకులు అసహనంతో కదులుతూనే ఉంటారు. కామెడీ వరకైతే బాగానే వర్కౌట్ చేశాడు. భయంకరమైన ట్విస్టులేం లేకపోయినా, ఇంటర్వెల్ బ్యాంగ్ విషయంలోను .. క్లైమాక్స్ విషయంలోనూ డైరెక్టర్ జడ్జిమెంట్ కరెక్టుగానే ఉందనిపిస్తుంది.
సంగీతం విషయానికి వస్తే. మహతి స్వరసాగర్ బాణీలను అందించాడు. 'ఏముందిరా .. 'అనే పాట ఆల్రెడీ పాప్యులర్ అయింది. మిగతా పాటలు సందర్భానికి తగినట్టుగా వచ్చి పోతుంటాయి .. అంతేగానీ గుర్తుపెట్టుకునే స్థాయిలో లేవు. ఫొటోగ్రఫీ .. ఎడిటింగ్ ఫరవాలేదనిపిస్తాయి. 'గాలిలేని గదిలో రోజంతా ఉండొచ్చుగానీ .. విలువలేని ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేం' .. ' ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించడం కష్టమని నాకు తెలుసు .. కానీ ఒక అబద్ధాన్ని అబద్ధమని నమ్మించడం కూడా కష్టమేనని ఇప్పుడే తెలిసింది' వంటి ఒకటి రెండు డైలాగ్స్ మాత్రమే గుర్తుంటాయి. మిగతా సంభాషణలు సాధారణంగానే సాగిపోతాయి.
లుక్ పరంగా .. యాక్టింగ్ పరంగా నాగశౌర్య చాలా బాగా చేశాడు. ఇక షెర్లీ సెటియా కూడా పాత్రకి తగినట్టుగా చేసింది. ఈ న్యూజిలాండ్ అమ్మాయి తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకోవడం అభినందించవలసిన విషయమే. అయితే ఒక కథానాయికగా ఆమె ఈ పాత్రకి అతకలేదేమోనని అనిపిస్తుంది. ప్రేక్షకులు ఆశించే గ్లామర్ ఆమె నుంచి అందలేదేమోనని అనిపిస్తుంది. ఇక రాధిక నటన గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. అమితాష్ ప్రధాన్ కూడా పాత్ర పరిధిలో నీట్ గా చేశాడు. రొటీన్ గా సాగే కథాకథనాలు .. అంతగా ఆకట్టుకోని పాటల కారణంగా ఈ సినిమా ఆశించిన స్థాయిని అందుకోలేకపోయిందనే చెప్పాలి.
మూవీ రివ్యూ: 'కృష్ణ వ్రింద విహారి'
| Reviews

Krishna Vrinda Vihari Review
- ఈ శుక్రవారమే విడుదలైన 'కృష్ణ వ్రింద విహారి'
- రొమాంటిక్ కామెడీ టచ్ తో నడిచిన ఫ్యామిలీ ఎంటర్టైనర్
- నాగశౌర్య జోడీగా పరిచయమైన షెర్లీ సెటియా
- కొత్తదనం లేని కథాకథనాలు
- అంతగా ఆకట్టుకోని బాణీలు
Movie Name: Krishna Vrinda Vihari
Release Date: 2022-09-23
Cast: Nagasharya, Shirle Setia, Radhika, Amithash Pradhan, Vennela Kishore, Rahul Ramakrishna, Sathya
Director: Anish Krishna
Music: Mahathi Swara Sagar
Banner: IRA Creatoins
Review By: Peddinti