: ములాయం ప్రధాని నివాసంలో స్వీపర్ గా కూడా పనికిరాడు: కేంద్రమంత్రి బేణీప్రసాద్
తన మాజీ మిత్రుడు, సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత ములాయంసింగ్ యాదవ్ పై కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నేత బేణీ ప్రసాద్ వర్మ మరోసారి అభ్యంతరకర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ములాయం కనీసం ప్రధానమంత్రి నివాసంలో స్వీపర్ గా కూడా పనికిరాడని బేణీ ప్రసాద్ వర్మ వ్యాఖ్యానించారు. యాదవ్ ప్రధానమంత్రి కావాలనుకుంటే ముందుగా ప్రధానమంత్రి నివాసంలో స్వీపర్ ఉద్యోగం తెచ్చుకోవాలని సూచించారు. ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ లో ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా బేణీ ప్రసాద్ ఈ వ్యాఖ్యలు చేశారు. మోసాలు, అబద్ధాలపై ఏర్పడ్డ పార్టీయే ఎస్పీ అని అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ విచారం వ్యక్తం చేసింది. ఒకవేళ బేణీ ప్రసాద్ ఇలా వ్యాఖ్యానించి ఉంటే విచారకరమని కాంగ్రెస్ ప్రతినిధి మీమ్ అఫ్జల్ ఢిల్లీలో అన్నారు. ములాయం చాలా పెద్ద రాజకీయ నేత అని, బేణీప్రసాద్ వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని చెప్పారు.