: పంచాయతీ ఎన్నికల ముహూర్తం ఖరారు
స్థానిక సంస్థల సమరంలో తొలి అంకం పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ప్రకటించారు. ఈ మధ్యాహ్నం హైదరాబాద్ లోని బుద్ధభవన్ లో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమాకాంత్ రెడ్డి ఎన్నికల వివరాలను మీడియాకు వెల్లడించారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన వివరణాత్మక నోటిఫికేషన్లను ఆయా జిల్లాల కలెక్టర్లు ఈనెల 9న విడుదల చేస్తారని ఆయన తెలిపారు. తొలి విడత ఎన్నికలు 23న, రెండో విడత 27న, తుదివిడత ఎన్నికలు 31న ఉంటాయని పేర్కొన్నారు. నామినేషన్ల స్వీకరణకు ఈనెల 13 చివరితేదీ అనీ, 14న నామినేషన్ల పరిశీలన జరుపుతామని తెలిపారు.
ఇక ఈ నెల 17 నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువని రమాకాంత్ రెడ్డి వెల్లడించారు. కాగా, ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహిస్తామని, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతామని వివరించారు. కాగా, ఈ ఎన్నికల్లో బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరుగుతుందని కమిషనర్ చెప్పారు.