: తుస్సుమన్న రష్యా రాకెట్ ప్రయోగం
భారత్ కు ఆదినుంచి రాకెట్ ప్రయోగాల్లో సహకరిస్తూ, కొన్నాళ్ళవరకూ ఆ విశిష్ట పరిజ్ఞానాన్ని అందిస్తూ వచ్చిన రష్యా.. తాజాగా భారీ వైఫల్యం ఎదుర్కొంది. భారత్ తన తొలి నేవిగేషన్ శాటిలైట్ 'ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఏ' ను విజయవంతంగా ప్రయోగించిన మరుసటి రోజే రష్యా సంధించిన ప్రోటాన్ రాకెట్ కుప్పకూలింది. ఈ పరిణామం రష్యా ప్రభుత్వాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
కజకిస్తాన్ లోని బైకనూర్ కాస్మోడ్రోమ్ నుంచి స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం ఈ ప్రయోగం జరగగా.. నింగికెగిసిన కాసేపటికే ఈ ప్రోటాన్-ఎం రాకెట్ గతి తప్పి భూమి దిశగా దూసుకువచ్చింది. మంటల్లో చిక్కుకుని తునాతునకలైంది. ఈ రాకెట్ మూడు నేవిగేషన్ శాటిలైట్లను కక్ష్యలో ప్రవేశపెట్టాల్సి ఉంది. కాగా, ప్రోటాన్ సిరీస్ రాకెట్లు 2010 నుంచి వైఫల్యాల బారినపడడం ఇది ఐదోసారి. 2012 డిసెంబర్ లో ప్రొటాన్ రాకెట్ ఓ కమ్యూనికేషన్స్ ఉపగ్రహాన్ని పొరబాటున వేరే కక్ష్యలో ప్రవేశపెట్టి విశ్వసనీయత కోల్పోయింది. తాజా వైఫల్యానికి కారణాలను విశ్లేషిస్తున్నారు.