: సూర్యుడి గుట్టు రట్టు కానుంది
సూర్యుడి ఉపరితలానికి సంబంధించిన రహస్యాలను వెలికితీసేందుకు శాస్త్రవేత్తలు సిద్ధపడుతున్నారు. దీనికి అవసరమైన సమాచారాన్ని సేకరించడంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. ఒక సౌండిరగ్ రాకెట్‌లో అత్యాధునిక కెమెరాను ఏర్పాటు చేసి దాని ద్వారా సూర్యుడి ఉపరితలానికి సంబంధించిన ఫోటోలను శాస్త్రవేత్తలు సాధించారు. ఈ ఫోటోల ద్వారా సూర్యుడి ఉపరితలానికి సంబంధించిన రహస్యాలను తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
శాస్త్రవేత్తలు ఒక హై రిజల్యూషన్ కరోనల్ ఇమేజర్ కెమెరాతో సూర్యుడి వాతావరణానికి సంబంధించి చిత్రాలను సేకరించారు. ఈ కెమెరా గతంలో వాటికన్నా చాలా స్పష్టమైన చిత్రాలను చిత్రించి పంపింది. ఈ చిత్రాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు సూర్యుడి బాహ్య వలయంలో కరోనాలోని అనేక కొత్త లక్షణాలు బయటపడ్డాయి. సూర్యుడి ఉపరితలంపై క్రియాశీలంగా ఉన్న భారీ సౌర మచ్చ ప్రాంతాన్ని ఈ కెమెరా చాలా నిశితంగా పరిశీలించి చిత్రాలను చిత్రించింది. ఈ చిత్రాల్లో ఉపరితలంపై ఉన్న 'హైవే'లను, వాటిలో వెనక్కి తన్నుతున్న వాయువులతో కూడిన బుడగలను కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు. సూర్యుడి అయస్కాంత క్షేత్రం ఉపరితలంపై హైవేలను ఏర్పరుస్తోందని, అలాగే ఇందులోని బుడగలు సెకనుకు సుమారు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయని, ఈ వేగం భూమిపై ధ్వనివేగానికి 235 రెట్టు ఎక్కువని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ హైవేల వెడల్పు 450 కిలోమీటర్ల మేర ఉంది. ఈ హైవేలపై మరిన్ని పరిశోధనలు చేయడం ద్వారా సూర్యుడినుండి వెలువడే కరోనల్ మాస్ ఎజెక్షన్‌లను గురించి ముందుగానే అత్యంత కచ్చితత్వంతో అంచనా వేయడానికి వీలవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సూర్యుడు కరోనల్ మాస్ ఎజెక్షన్ ద్వారా టన్నుల కొద్దీ ప్లాస్మాను అంతరిక్షంలోకి విడుదల చేస్తాడనీ, అయితే ఇది భూమిపైకి వస్తే పవర్ గ్రిడ్‌లు, ఉపగ్రహాల్లోని ఎలక్ట్రానిక్ పరికరాలు దెబ్బతినే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. సూర్యుడి ఉపరితలం కన్నా బాహ్యవలయమైన కరోనా 400 రెట్లు వేడిగా ఉండడానికి కారణం కూడా ఈ ఫోటోలలో తెలిసింది. ఫోటోల్లో కనిపించిన ప్రకాశవంతమైన చుక్కలు కరోనా వేడికి సంబంధించిన గుట్టును విప్పే అవకాశముందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ చుక్కల వెడల్పు సుమారు 680 కిలోమీటర్లుగా ఉంది. కరోనాలోకి భారీ స్థాయిలో శక్తి వచ్చి పడుతోంది అనడానికి ఈ మెరుపులే సంకేతాలని శాస్త్రవేత్తలు తెలిపారు. సూర్యుడిలో ప్లాస్మాను వేడిచేయడానికి కూడా ఇది ఉపయోగపడుతూ ఉండవచ్చని కూడా శాస్త్రవేత్తలు తెలిపారు.