: విద్యుత్ చార్జీలపై అర్ధాంతరంగా ముగిసిన బహిరంగ విచారణ
విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలపై విజయవాడలో ఈఆర్ సీ చేపట్టిన బహిరంగ విచారణ అర్థాంతరంగా ముగిసింది. పెంచిన చార్జీలపై చర్చించేందుకు టీడీపీ, సీపీఎంలు ముందుకొచ్చాయి. దేవినేని ఉమ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు, పలువురు కార్యకర్తలు హాజరయ్యారు. కానీ, ఎలాంటి విచారణ జరగకుండానే నిలిచిపోయింది.
పెంచిన చార్జీల ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం, టీడీపీలు అధికారులకు నోటీసులు ఇచ్చి, అక్కడిక్కడే ఆందోళనకు దిగాయి. వేదిక ఎదుటే టీడీపీ నేతలు భైఠాయించగా, వేదిక బయట సీపీఎం కార్యకర్తలు నినాదాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. ఓ దశలో ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. నేతలను, కార్యకర్తలను చెదరగొట్టి తమ అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు మాట్లాడిన రాఘవులు.. పెంచిన విద్యుత్ చార్జీలను సర్కార్ వెనక్కి తీసుకోవాలని, లేకపోతే ఆందోళన మరింత ఉధృతమవుతుందని హెచ్చరించారు.