: సంజయ్ దత్ జైలు నుంచీ కదిలించాడు
సంజయ్ దత్ మనసు ఇప్పుడు తన తాజా చిత్రం పోలీస్ గిరి వసూళ్లపై లేదు. ఉత్తరాఖండ్ బాధితుల వేదనపైనే ఉంది. వారికి తన వంతుగా తోడ్పాటునందించాలని తలంచిన సంజయ్ దత్ నలుగురికీ ఆదర్శంగా నిలిచేలా వ్యవహరించారు. వాస్తవానికి పోలీస్ గిరి చిత్రం ప్రీమియర్ షో దుబాయ్ లో ప్రదర్శించాలని ప్లాన్ చేశారు. పుణెలోని ఎరవాడ జైలులో ఉన్న సంజయ్, తన భార్య మాన్యతాదత్ తో ప్రతీ రోజూ లేఖల ద్వారా తన భావాలను పంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దుబాయిలో ప్రీమియర్ షోకు బదులుగా ముంబైలోనే ఒక చారిటీ కార్యక్రమం ఏర్పాటు చేసి వచ్చిన నిధులను ఉత్తరాఖండ్ వరద బాధితులకు అందించాలని కోరాడు. దీనిపై చిత్ర నిర్మాత టీపీ అగర్వాల్ స్పందిస్తూ చారిటీ కార్యక్రమంతో పాటు మహారాష్ట్రలో మొదటి రోజు మొదటి ఆట ద్వారా వచ్చిన ఆదాయాన్ని బాధితులకు విరాళంగా అందించనున్నట్లు చెప్పారు. ముంబైలో నిర్వహించే చారిటీ కార్యక్రమానికి మాన్యతాదత్, కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు.