: టేస్ట్‌ చేసి చూడండి...!?


అదో కూర... ఎలాంటి కూరంటే మసాలాలు బాగా దట్టించిన కూర. అయినా కూడా మీరు ఈ కూరను తినలేరు. అలాగని ఇది రుచిలో తేడా ఉంటుందా అనుకునేరు. అలా ఏం కాదు. చక్కగా మంచి మసాలాలు వేసి వండిన కూర. దీని ధర కూడా వెరైటీని బట్టి రూ.860 నుండి రూ.1,200 వరకూ ఉంటుంది. అంతటి రేటున్న కూరను తింటే మాత్రం మీరు చాలా గ్రేట్‌ అనే చెప్పుకోవాలి.

న్యూయార్క్‌లోని ద బ్రిక్‌ లేన్‌ కర్రీ హౌస్‌ వాళ్లు ఒక ఘాటైన వంటకాన్ని తయారు చేశారు. దీనిపేరు 'పాల్‌'. పేరు బాగుందే అనుకుని ట్రై చెయ్యాలనుకుంటున్నారా... జాగ్రత్త. దీన్ని తిన్న తర్వాత మీరు గట్టిగా ఏడ్చినా ఏడుస్తారు... లేదా నేలపై పడి గిలగిలా కొట్టుకున్నా, వాంతి చేసుకున్నా కూడా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. ఎందుకంటే అంత ఘాటుగా ఉంటుంది ఈ వంటకం. ఎంతలా అంటే దీన్ని చేసే వంటవాళ్లు కూడా ముందు జాగ్రత్తగా గ్యాస్‌ మాస్కులు వేసుకుని మరీ వండుతారు. అంతటి ఘాటన్నమాట. ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిరపకాయలు, భారతీయ మసాలాలు ఇందులో దట్టించి దీన్ని తయారు చేసినట్టు రెస్టారెంట్‌ మేనేజర్‌ ధీరజ్‌ తివారీ చెబుతున్నారు. ఈ మసాలా దినుసుల్లో మనదేశానికి చెందిన అత్యంత ఘాటైన మిరపకాయ భట్‌ జొలోకియా కూడా ఉంది. మన సైన్యం ఈ మిరపకాయను టియర్‌గ్యాస్‌ తయారు చేయడానికి వాడుతుంది. ఇలా అత్యంత ఘాటైన పదార్ధాలతో తయారైన ఈ పాల్‌ను తింటే మాత్రం కచ్చితంగా వాళ్లు కన్నీళ్లపాలవుతారని తెలిసినా కూడా చాలామంది వెరైటీ కోసం ఈ రెస్టారెంట్‌కు వచ్చి ఈ కూరను ఆర్డర్‌ చేస్తున్నారట. మరో విశేషమేమంటే, ఈ కూరను పూర్తిగా తిన్నవారికి రెస్టారెంట్‌ వాళ్లు ఒక బీరును ఉచితంగా అందజేస్తారు. 'పాల్‌' ఆఫ్‌ ఫేమ్‌లో మీ పేరును కూడా చేరుస్తూ ప్రత్యేకంగా ఒక సర్టిఫికేట్‌ను కూడా ఇస్తారు. మరి టేస్ట్‌ చూస్తారా...?!

  • Loading...

More Telugu News