: చర్మకేన్సర్‌తో మరణించేది ఎక్కువగా మగవారే
చర్మకేన్సర్ వల్ల మరణించేది ఎక్కువగా మగవారేనని ఒక పరిశోధనలో తేలింది. చర్మక్యాన్సర్ సోకిన ఆడవారికన్నా మగవారు ఎక్కువగా మరణానికి గురవుతారని ఈ పరిశోధన చెబుతోంది. స్త్రీ, పురుషుల శరీరాల్లో ఉన్న సహజ శారీరక భేదాలు ఇందుకు కారణం కావొచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు నిర్వహించిన ఒక పరిశోధనలో యవ్వనంలో ఆడవారికన్నా కూడా మగవారు 55 శాతం మంది చర్మకేన్సర్‌తో చనిపోతున్నారని తేలింది. వీరు 1989 నుండి 2009 వరకూ 15 నుండి 39 ఏళ్ల మధ్య వయసున్న సుమారు 29 వేలమంది యువతను ఈ పరిశోధనలో పరిశీలించారు. నిజానికి చర్మకేన్సర్ ఎక్కువగా శ్వేతజాతీయుల్లోనే కనిపిస్తుంటుంది. అందునా ఎక్కువగా యువకుల్లో ఉంటోందని ఈ పరిశోధనలో తేలింది. చర్మకేన్సర్‌తో వచ్చే ట్యూమర్ (రాచకురుపు) ఉన్నా లేకున్నా కూడా వాటి తీవ్రత ఏ స్థాయిలో ఉన్నా కూడా ఇది ఎక్కువగా మగవారినే మరణానికి గురిచేస్తోందని ఈ పరిశోధనలో తేలింది.