: వైఎస్సార్ సీపీలో బయటపడుతున్న వర్గవిభేదాలు
వైఎస్సార్ సీపీలో వర్గవిభేదాలు బయటపడుతున్నాయి. నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు మరింత ముదిరి రాజీనామాలకు దారి తీస్తున్నాయి. తాజాగా నిజామాబాద్ జిల్లాలో అన్నీ తామై పార్టీని నడిపిస్తున్న సీనియర్ నేతలు పార్టీకి రాజీనామా చేశారు. వీరు పోతూపోతూ తమతోపాటు 15మంది మండల కన్వీనర్లను, మరి కొందరు సేవాదళ సభ్యులను తమతో తీసుకువెళ్లారు. వైఎస్సార్ సీపీ డబ్బున్న వారికే ప్రాధాన్యమిస్తోందని మండిపడ్డారు. పార్టీలో పూర్తిగా వ్యాపారాత్మక రాజకీయాలు నడుస్తున్నాయని వెంకటరెడ్డి, సాయిరెడ్డి, మోహన్ రెడ్డి విరుచుకుపడ్డారు.
కళ్యాణ దుర్గంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో అనంతపురం జిల్లా వర్గవిభేదాలు బహిర్గతమయ్యాయి. రెండు వర్గాల వారు ఒకరిపై ఒకరు కలబడి కొట్టుకున్నారు. ఎల్ఎం మోహన్ రెడ్డి వర్గం, దొడ్డగట్ట కిట్టప్ప వర్గం దాడులు చేసుకుని ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. కిట్టప్ప వర్గం తనను చంపేందుకు ప్రయత్నిస్తోందంటూ మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు.
గుంటూరు జిల్లా వైఎస్సార్ సీపీలో అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. సుమారు పది నియోజకవర్గాలకు చెందిన నేతలంతా ప్రైవేటు అతిథిగృహంలో సమావేశమయ్యారు. పార్టీలో నలుగురైదుగురికి తప్ప ఎవరికీ ప్రాధాన్యత లేదని, జరుగుతున్న పరిణామాలపై తమ గొంతు వినిపించే అవకాశం లేకుండా పోతోందనీ, పార్టీకోసం పనిచేస్తున్న వారికి గుర్తింపు లేకుండా చేస్తున్నారని గోపీరెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, విజయలక్ష్మి తదితరులు నిస్సహాయతను వ్యక్తం చేశారు.