: విచారణ వాయిదా వేస్తే జడ్జి గారు ఫైన్ కట్టాలి!
అదే పనిగా కక్షిదారులు కోరుతున్నారని చెప్పి వాయిదాలకు అనుమతిస్తూ, ఆలస్యానికి కారణమయ్యే న్యాయమూర్తులు ఇకపై జరిమానా కట్టే రోజు రానుంది. కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ లోని 309 సెక్షన్ కింద కేసు విచారణలో వాయిదాలను 3కి పరిమితం చేయాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరుతోంది. ఈ గీత దాటిన న్యాయమూర్తులపై జరిమానా విధించాలని సంప్రదింపులు జరుపుతోంది. ఇదే సెక్షన్ కింద అత్యాచారం లాంటి తీవ్రమైన నేరాలలో విచారణను రెండు నెలలలో ముగించాల్సి ఉంది. కానీ, అమలవుతున్న దాఖలాలు తక్కువే. దీంతో వీటిని అమలు చేసే విషయమై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుతో చర్చిస్తోంది. ఇవి అమలు చేస్తే న్యాయం సత్వరమే లభించడానికి మార్గం సుగమం అవుతుందనడంలో సందేహం లేదు.