: కాదేదీ సృజనకనర్హం...!
ఇది, అది అని లేకుండా దేన్నైనా సృజనాత్మకతా దృష్టితో చూడచ్చు. చివరికి వెంట్రుకలను కూడా... మనం వేసుకునే కోటును తయారు చేయడానికి ఏదైనా పాలిస్టర్, కాటన్, లెనిన్, ఉలన్ లాంటి బట్టలను వాడుతుంటారు. అయితే ఒక కోటు మాత్రం పూర్తి వెరైటీగా తయారైంది.
ఆర్లా అనే చాకొలేట్ కంపెనీ తమ ఉత్పత్తుల ప్రచారం కోసం కొత్త రకం దుస్తులను రూపొందించింది. ఇందులో ఈ కోటు కూడా ఒకటి. ఇంతకీ ఈ కోటు స్పెషాలిటీ ఏంటంటే... ఈ కోటు పూర్తిగా అబ్బాయిల ఛాతీ రోమాలతో తయారు చేయబడింది. ఇలాంటి కోటును తయారు చేయడానికి పాపం బ్రిటిష్ డిజైనర్లు చాలా కష్టపడ్డారు. క్వింటాళ్ల కొద్దీ రోమాలను సేకరించి, సుమారు రెండు వందల గంటలపాటు శ్రమించి దీన్ని రూపొందించారు. దీని తయారీకోసం ఇరవై నాలుగువేల రూపాయలను ఖర్చు చేసి మరీ రూపొందించారు. చూసేందుకు చక్కగా ఉన్న ఈ కోటు తయారీ కథను విన్న వారికి కాదేదీ సృజనకనర్హం అని అనక తప్పదు.