: కలియుగ కృష్ణులు పుడతారేమో...
కృష్ణుడికి ఇద్దరు తల్లులు. వీరిలో ఒకరు కన్నతల్లి అయితే మరొకరు పెంచిన తల్లి. అయితే ఇప్పుడు కలియుగ కృష్ణుడు లేదా... కృష్ణమ్మలకు మాత్రం తండ్రి ఒక్కరే అయినా... తల్లులు మాత్రం అచ్చంగా ఇద్దరే ఉంటారు. ఎందుకంటే తల్లిదండ్రుల ద్వారా బిడ్డలకు ఎలాంటి జన్యుపరమైన వ్యాధులు సంక్రమించకుండా ఉండేందుకు గాను ఇలాంటి సంకరణలను వైద్యపరంగా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ విషయం మాత్రం ఇంకా ప్రభుత్వ అనుమతి పొందాల్సి ఉంది.
బ్రిటన్ ప్రభుత్వ ఆరోగ్య సంస్థవారు ఇన్‌విట్రో ఫర్టిలైజేషన్ అనే చికిత్సకు సంబంధించిన ముసాయిదాను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అసలు ఇన్‌విట్రో ఫర్టిలైజేషన్ అంటే పిల్లలకు జన్యుపరమైన వ్యాధులు సంక్రమించకుండా ఉండేందుకుగాను రెండవ తల్లికి సంబంధించిన డిఎన్‌ఏను తీసుకుని మొదటి తల్లి అండాశయానికి సంబంధించిన డిఎన్‌ఏ స్థానంలోకి మార్పిడి చేస్తారు. ప్రస్తుతం బ్రిటన్‌లో ఏటా పదిమంది పసివారు కళ్లు తెరవకముందే మరణిస్తున్నారు. దీనికి కారణం తల్లి అండంలోని మైటోకాండ్రియల్ డిఎన్‌ఏలోని లోపాలు. ఈ లోపాలను సవరించేందుకు తల్లి అండంలోని సమస్యాత్మక మైటోకాండ్రియల్‌ను తొలగించి దాని స్థానంలో ఆరోగ్యవంతమైన మరొక మహిళ అండానికి చెందిన ఆరోగ్యవంతమైన మైటోకాండ్రియల్ డిఎన్‌ఏను ప్రవేశపెడతారు. బ్రిటన్ పార్లమెంటులో ఈ ఇన్‌విట్రో ఫర్టిలైజేషన్ బిల్లుకు గనుక ఆమోద ముద్ర లభించినట్లయితే మరో రెండేళ్లకు అనగా 2015 నాటికి ఆ దేశంలో ఇద్దరు తల్లులు ఉండే బిడ్డలు ఉన్న దేశంగా బ్రిటన్ గుర్తింపు పొందుతుంది.