: ఇంట్లో బీపీవో ఉద్యోగి, వీధిలో దొంగ
ఇంట్లో ఉద్యోగం చేస్తున్నానని చెబుతాడు, ఇంట్లోంచి బయటకు రాగానే దొంగగా మారుతుంటాడు. ఇదేదో రాబిన్ హుడ్ టైపు సినిమా కాదు కానీ, అచ్చం సినిమా కధను పోలిన సంఘటన చెన్నైలో జరిగింది. కర్ణాటకకు చెందిన 23 ఏళ్ల మంజునాథ్ అనే యువకుడు తాను బీపీవోలో పని చేస్తున్నానని ఇంట్లో చెబుతూ, ల్యాప్ టాప్ బ్యాగ్ వేసుకుని వీధుల్లోకి రాగానే దొంగ అవతారమెత్తుతున్నాడు. అలా దొంగతనానికి వెళ్తూ బుధవారం దొరికిపోయాడు. ఇలా అతను గత నాలుగేళ్లలో 25 ఇళ్లను దోచుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ దొంగతనాల్లో 65 లక్షల విలువ చేసే 311 సవర్ల బంగారం దోచుకున్నాడని తెలిపారు.
ఇతని దొంగతనాల స్టైల్ పోలీసులు వివరిస్తూ ల్యాప్ టాప్ బ్యాగ్ లో కిటికీలు తొలగించే టూల్ కిట్ భుజాన వేసుకుని రాత్రుళ్లు తన బైక్ పై మంజునాథ్ బయల్దేరుతాడని, తాళం వేసిఉన్న ఇళ్లు కన్పిస్తే వాటిపని పట్టేస్తాడని వివరించారు. తాను దొంగిలించిన బంగారమంతా టీనగర్ లో ఉన్న పెద్ద షాపుల్లో మారుస్తూ ఒరిజనల్ బిల్లులు సంపాదిస్తాడని తెలిపారు. కాగా మంజునాథ్ తండ్రి ప్లంబర్ గా పనిచేస్తున్నాడు. చిన్నప్పట్నుంచీ సినిమాలు చూసేందుకు నానమ్మదగ్గర చిల్లర నొక్కేసేవాడని, ఆ అలవాటు అతనితోపాటు పెద్దయి దొంగగా మారాడని పోలీసులు తెలిపారు. సీసీ టీవీల్లో రికార్డయిన ఇతని విజువల్సే ఇతనిని పట్టించాయని పోలీసులు తెలిపారు.