: సమరశంఖం పూరించిన ధోనీ
టీమిండియా సారథి మహేంద్ర సింగ్ ధోనీ సమరశంఖం పూరించాడు. ఇంగ్లండ్ గడ్డపై చిరస్మరణీయ రీతిలో చాంపియన్స్ ట్రోఫీ నెగ్గి మాంచి ఊపుమీదున్న ధోనీ, విండీస్ గడ్డపై నేడు ఆరంభం కానున్న ముక్కోణపు సిరీస్ లోనూ అదే జోరు కొనసాగిస్తామన్నాడు. ఈ టోర్నీలో పాల్గొంటున్న మూడు జట్ల కెప్టెన్ల పరిచయ కార్యక్రమంలో ధోనీ పాల్గొన్నాడు. కింగ్ స్టన్ లో గురువారం రాత్రి జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తాము మరీ ఎక్కువ దూరం ఆలోచించడలేదని.. ఓ సిరీస్ తర్వాత మరో సిరీస్ అన్న దృక్పథాన్ని అనుసరిస్తున్నామని చెప్పాడు.
చాంపియన్స్ ట్రోఫీ చేజిక్కించుకునే క్రమంలో ఉత్తమ ప్రదర్శన కనబరిచామని, ఆ ఆటతీరునే ఇక్కడా కొనసాగిస్తామని చెప్పుకొచ్చాడు. ప్రత్యర్థుల బలాబలాలను బట్టి మ్యాచ్ లకు వ్యూహాలు రచిస్తామని ధోనీ వెల్లడించాడు. ప్రస్తుతం జట్టు పురోగామిపథంలో పయనిస్తోందని పేర్కొన్నాడు. కాగా, ఈరోజు జరిగే ఆరంభ మ్యాచ్ లో ఆతిథ్య వెస్టిండీస్, శ్రీలంకతో తలపడనుంది.