: సీబీఐకి స్వేచ్ఛా వాయువులు?
పెద్ద పెద్ద స్కాములు, ముఖ్యమైన కేసుల దర్యాప్తును చేపట్టే సీబీఐకి ఇకపై కొంత స్వతంత్రత రానుంది. సీబీఐ స్వయంప్రతిపత్తికి సంబంధించి మంత్రుల బృందం చేసిన సిఫారసులను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. దీని ప్రకారం సీబీఐ డైరెక్టర్ నియామకం ఇక ఎంతమాత్రం ప్రభుత్వ ఇష్టం కాదు. ప్రధానమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి, లోక్ సభలో విపక్షనేత ముగ్గురితో ఏర్పాటయ్యే కొలీజియం సీబీఐ డైరెక్టర్ ను ఎంపిక చేస్తుంది. న్యాయమూర్తి, విపక్ష నేత ఉంటున్నందున నియామకం పారదర్శకం కానుంది.
బొగ్గు స్కాం దర్యాప్తు నివేదికను న్యాయమంత్రి, అధికారులతో పంచుకుని వారి సూచనల మేరకు మార్పులు చేశానని సీబీఐ డైరెక్టర్ సుప్రీంకోర్టు ముందు వెల్లడించడం తెలిసిందే. ఆ సందర్భంగానే "సీబీఐకి స్వయంప్రతిపత్తి కల్పిస్తారా? లేక మేమే ఆదేశాలు జారీ చేయాలా?" అని సుప్రీంకోర్టు ఘటుగా స్పందించింది. సీబీఐ దర్యాప్తుపై ప్రభుత్వ పెత్తనం ఎంత మాత్రం సరికాదని పేర్కొంది. ప్రతిపక్షాలు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఇదే విషయంలో జూలై 6న సుప్రీంకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సీబీఐకి కొంత స్వేచ్ఛనిచ్చే సిఫారసులను కేబినెట్ ఆమోదించడం విశేషం.