: మానసిక ఒత్తిడి గుండెని ఒత్తేస్తుంది
మానసికంగా ఒత్తిడి అంత మంచిది కాదని, ఇలా ఒత్తిడి ఎదుర్కొనేవారికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటి కాలంలో మానసికంగా చాలామంది ఒత్తిడి ఎదుర్కొంటున్న వారే. మిగిలిన వారితో పోల్చితే ఇలా ఒత్తిడి ఎదుర్కొనేవారికి గుండెపోటు వచ్చే ప్రమాదం రెండు రెట్లు ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఫ్రాన్స్, ఫిన్‌లాండ్‌కు చెందిన వైద్యులు సుమారు 7,268 మంది స్త్రీ, పురుషులపై పరిశోధనలు సాగించారు. 1991 నుండి 2009 వరకూ సాగిన ఈ పరిశోధనలో వారు వివిధ దశల్లో 49.5 ఏళ్ల సగటు వయసున్న వారిని పరీక్షించారు. ఈ పరిశోధనలో ఈ పద్ధెనిమిది ఏళ్ల కాలంలో సుమారు 352 మంది గుండెపోటుకు గురయ్యారని తేలింది. ఇలా గుండెపోటుకు గురైన వారిలో ఎక్కువమంది మొదట్లో తీవ్ర ఒత్తిడి ఆందోళనలు వ్యక్తం చేసిన వారేనని చెబుతున్నారు.
అయితే సమస్యను గురించి పెద్దగా పట్టించుకోని వారితో పోల్చితే ఇలా సమస్యను గురించి సతమతమయ్యే వారిలో గుండెపోటు ప్రమాదం 2.12 రెట్లు ఎక్కువగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు. వీరికి ఎలాంటి శారీరక, మానసిక అంశాలు, రోజువారీ అలవాట్లతో సంబంధం లేకుండా కేవలం మానసికంగా ఒత్తిడికి గురికావడం వల్లే గుండెపోటుకు గురయ్యే వారి శాతం 49 శాతం ఎక్కువగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి ఒత్తిడిని దూరం చేసుకుని ఆరోగ్యంగా సాగుదాం!