: ఉత్తరాఖండ్ సహాయక చర్యల్లో రెండు యువ జంటలు


ఉత్తరాఖండ్ సహయక చర్యల్లో పాల్గొంటున్న రెండు యువజంటలు అందర్నీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. విధినిర్వహణలో భాగంగా ఉత్తరాఖండ్ వరదబాధితులకు సహాయమందిస్తున్న వాయుసేన విభాగంలో రెండు యువ జంటలు పాలు పంచుకుంటున్నాయి. అందులో పురుషులిద్దరూ ఎంఐ-17 హెలీకాప్టర్ నడుపుతుండగా, మహిళలు చీతా అనే హెలీకాప్టర్లకు పైలెట్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. స్క్వాడ్రన్ లీడర్ ఎస్ కే ప్రధాన్, ఖష్బూ గుప్తాలకు పెళ్లై నాలుగేళ్లయింది. వారితోపాటు విధులు నిర్వర్తిస్తున్న ఫ్లైట్ లెఫ్టెనెంట్ తాన్యాశ్రీనివాసన్, స్క్వాడ్రన్ లీడర్ విక్రమ్ త్యాగరామన్ ల పెళ్లై ఏడాదయింది.

వీరంతా సహాయక చర్యల ప్రధాన కేంద్రం గౌచార్ లో విధులు నిర్వర్తిస్తున్నారు. తాము ఒకే చోట విధులు నిర్వర్తించడం సంతోషం కలిగిస్తోందని వారు ఆనందం వ్యక్తం చేశారు. అయితే వృత్తి జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని వేరుగా చూసే సామర్ధ్యాన్ని శిక్షణలోనే నేర్పిస్తారని, జీవిత భాగస్వామి దగ్గరగా ఉండడంవల్ల విధినిర్వహణకు ఎలాంటి ఆటంకం కలగదని యువపైలట్లు చెబుతున్నారు.

కొండలు, లోయలు, మంచు పర్వతాలు వాయుయానానికి ఏమాత్రం అనువుకాదని, అయితే తమ జీవిత భాగస్వాములు హెలీకాప్టర్లు తీసుకుని వెళ్తుంటే స్క్వాడ్రన్ లీడర్ల హోదాలో గర్వంగా చూస్తూ సలహాలు సూచనలు ఇచ్చిపుచ్చుకుంటామే తప్ప భయపడమని వారి భర్తలు తెలిపారు.

  • Loading...

More Telugu News