: 'కలం' వీరులకు కడుపు మండింది!


సమాజంలో కుళ్ళును, వ్యవస్థలకు పట్టిన చీడపీడలను ఒక్క కలంపోటుతో నిర్వీర్యం చేయగల వీరుడు.. పాత్రికేయుడు. అతడిప్పుడు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఆపన్నహస్తం అందించాల్సిన యాజమాన్యాలు 'చల్ నేదో' అంటూ నెట్టుకొస్తుండగా.. ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు ఆదమరిచాయి. సీన్ కట్ చేస్తే.. కలం యోధులు రోడ్డెక్కారు. పట్టణ, గ్రామీణ విలేకరులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, నిజం నిర్భయంగా చెబుతున్నందుకు ప్రతిఫలంగా తమపై జరిగే భౌతిక దాడులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ.. నేడు హైదరాబాద్ లో మహార్యాలీ నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య ఆధ్వర్యంలో సుందరయ్య పార్క్ నుంచి ఇందిరాపార్క్ వరకు చేపట్టిన ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాత్రికేయులు పాల్గొన్నారు. ర్యాలీ ఆరంభంలో జర్నలిస్టు సమాఖ్య అధ్యక్షుడు బసవపున్నయ్య మాట్లాడుతూ.. జర్నలిస్టులతో పాటు డెస్క్ లో పనిచేసే సిబ్బందికి సైతం జస్టిస్ గుర్ భక్ష్ మతీజియా వేతన సంఘం సిఫారసులను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

సబ్ ఎడిటర్లకు సైతం అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని ఆయన కోరారు. పాత్రికేయులకు పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలన్నారు. ఇప్పటికే కేరళ, కర్ణాటక, తమిళనాడు, బీహార్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు ఈ సౌకర్యాన్ని ప్రవేశపెట్టాయని బసవపున్నయ్య పేర్కొన్నారు. విధి నిర్వహణ వేళల్లో ప్రభుత్వోద్యోగులతో సమానంగా జర్నలిస్టులకు కూడా చట్టబద్ధమైన రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News