: ధోనీని ఆకాశానికెత్తిన గంగూలీ
భారత మాజీ డాషింగ్ ఓపెనర్, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలి మిస్టర్ కూల్ కెప్టెన్ ధోనీపై ప్రశంసల జల్లు కురిపించాడు. భారత క్రికెట్ లో ధోనీ అద్భుతాలు సృష్టించాడన్న గంగూలీ 2015 వరల్డ్ కప్ లో భారత జట్టుకు మరోసారి నాయకత్వం వహిస్తాడన్న విశ్వాసం వ్యక్తం చేశాడు. ధోనీ సమర్థుడైన నాయకుడని, కెప్టెన్ గా అతనిది అద్భుతమైన రికార్డని దాదా తెలిపారు. రైనా, జడేజా, రోహిత్ వంటి క్రీడాకారులను అతను ప్రోత్సహించాడని, అతని అండతోనే వాళ్లు తామేంటో నిరూపించుకోగలిగారని, ధోనీలో నాయకత్వ లక్షణాలు బాగా ఉన్నాయని తెలిపాడు.
తనకు, ధోనీకి మధ్య పోలిక తేవడంపై గంగూలీ మండిపడ్డాడు. ఆటగాళ్లు, కెప్టెన్లు, మనుషుల మధ్య పోలికలు సరికాదని తెలిపాడు. పరిస్థితులను బట్టీ మనుషులు అందుకు తగ్గట్టు ప్రవర్తిస్తారని, వ్యక్తుల మధ్య కాలమాన పరిస్థితులు మారిపోతుంటాయన్న విషయాన్ని గుర్తించాలని కోరారు. వాటిని బట్టీ స్పందించే తీరు కూడా మారిపోతుంటుందని తెలిపారు. అయినా ధోనీ మూడు మేజర్ టోర్నీలు సాధించిన కెప్టెన్ గా నిలిచిపోయాడని సౌరవ్ గంగూలీ అభినందించారు.