: నా తొలిప్రేమ సంగతి నా భార్యకు తెలుసు: ధనుష్
సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు, బాలీవుడ్ కొత్త ప్రేమికుడు ధనుష్ తన తొలి ప్రేమ కధ తన భార్య ఐశ్వర్యకు తెలుసన్నాడు. తాజాగా విడుదలై ప్రేక్షకాదరణ పొందుతున్న 'రాంజానా' సినిమాతో పాటూ అమాయకత్వం నిండిన మాటతీరుతో ధనుష్ బాలీవుడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు. తన సినిమా కధలోలానే నిజజీవితంలో కూడా తనకిష్టమైన అమ్మాయికోసం ఏం చేసేందుకైనా సిద్దపడ్డానని తెలిపాడు.
తాను 16 ఏళ్ల వయస్సులో ఉండగా మరో స్కూలుకు చెందిన ఓ అమ్మాయిని విపరీతంగా ఇష్టపడ్డానని, ఆమె కోసం గంటలతరబడి ఎదురు చూసేవాడినని తెలిపాడు. ప్రతి అబ్బాయీ చేసినట్టే తాను కూడా చేశానని అన్నాడు. ఏడాది తరువాత తన ప్రేమకధకు ఫుల్ స్టాప్ పడిందని, అయితే ఆ విషయాలన్నీ తన భార్య ఐశ్వర్యకు పెళ్లికి ముందే చెప్పానని తెలిపాడు. ఇదిలా ఉంచితే, ఇలాంటి పిట్టకథలు చెబుతూ, అప్పుడే ధనుష్ బాలీవుడ్ ప్రేక్షకులను బుట్టలో వేసుకునే ట్రిక్స్ తెలుసుకున్నాడని పరిశీలకులు అనుకుంటున్నారు.