: ఉగ్రవాదం, తీవ్రవాదం కంటే అవినీతే దేశాన్ని నాశనం చేస్తుంది: లక్ష్మీనారాయణ
ఉగ్రవాదం, తీవ్రవాదం కంటే అవినీతి, లంచగొండితనం దేశాన్ని నాశనం చేస్తాయని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. గుంటూరు జిల్లా బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలను సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, 1986-87 సంవత్సరాలలో అధ్యాపకుడిగా బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో పని చేసిన రోజులను గుర్తుచేసుకున్నారు. తన తొలి జీతాన్ని ముప్పలనేని శేషగిరిరావు దగ్గర్నుంచి అందుకుని చెల్లెలికి కేకు పంపిన విషయాన్ని తన జీవితాంతం మర్చిపోలేనని ఆయన అన్నారు. యువత సరైన మార్గంలో నడిస్తే దేశానికి మంచి రోజులు వచ్చినట్టేనని, లంచం తీసుకోవడం కంటే ఇవ్వజూపడం మరింత తీవ్రమైన నేరమని పేర్కొన్నారు. అవినీతి రహిత సమాజాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. ఈ సందర్భంగా పలువురు లక్ష్మీనారాయణను సత్కరించారు.