: యుద్ధభూమిలో ఆంధ్రా జవాను వీరమరణం
జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ శివారులో ఉగ్రవాదులకు, జవానులకు మధ్య నిన్న జరిగిన ఎదురు కాల్పుల్లో ఆంధ్రాజవాను వీరమరణం పొందాడు. యాదయ్య అనే జవాను యుద్దభూమిలో శత్రువుతో పోరాడుతూ తనువు చాలించాడు. కాగా, మృతుడు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన జవాను యాదయ్యగా సీఆర్ పీఎఫ్ ప్రకటించింది. యాదయ్య మృతదేహం రేపు హైదరాబాద్ చేరుకుంటుంది. అక్కడ్నుంచి అతని స్వగ్రామానికి చేర్చి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనుంది.
ప్రధాని మన్మొహన్ పర్యటనకు కొద్ది గంటల ముందుగా ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. శ్రీనగర్ జాతీయ రహదారిపై ఆర్మీకాన్వాయ్ పై హఠాత్తుగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన జవానులు ఎదురుకాల్పులు జరిపినప్పటికీ ఉగ్రవాదులు తప్పించుకున్నారు.
ఈ దాడిలో 8 మంది జవానులు మృతి చెందగా మరో 19 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనకు పాల్పడ్డామంటూ హిజ్బుల్ ముజాహిదీన్ ప్రకటించింది. ఇలాంటి దాడులే మరిన్ని చేస్తామని హెచ్చరించింది కూడా!