: భారీ నష్టాల్లో ప్రపంచ మార్కెట్లు
భారీ నష్టాలతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు అతలాకుతలమవుతున్నాయి. ముఖ్యంగా చైనా స్టాక్ మార్కెట్లో షాంఘై సూచీ గత నాలుగేళ్లలో ఎన్నడూ లేనంతగా నష్టపోయింది. సంక్షోభంలో ఉన్న ఆర్థిక సంస్థలకు చైనా సెంట్రల్ బ్యాంకు అయిన పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా.. బెయిల్ అవుట్ ప్యాకేజీ ఇచ్చే అవకాశం లేదని వార్తలు రావడంతో బ్యాంకు, రియాల్టీ షేర్లు భారీ పతనాన్ని చవిచూశాయి. నిన్న ఒక్కరోజు 5.3 శాతం నష్టపోయింది. పాయింట్ల వారీగా చూస్తే 110 పాయింట్లు పడి 1963 వద్ద క్లోజయింది.
గడిచిన 7 నెలల్లో షాంఘై సూచీ 2 వేల పాయింట్ల దిగువున ముగియడం ఇది రెండోసారి. బ్యాంకింగ్, రియాల్టీ షేర్లు తీవ్రంగా పడిపోవడంతో షాంఘై సూచీ నిలువుగా పతనమైంది. అయితే, ఇవాళ మాత్రం షాంఘై మార్కెట్ లాభనష్టాలు లేకుండా ఫ్లాట్‌గా ట్రేడవుతోంది. మరోవైపు గతరాత్రి డౌజోన్స్ 0.95 శాతం నష్టపోయి 14,659 వద్ద ముగిసింది. నాస్‌డాక్ 36 పాయింట్లు పడి 3,320 వద్ద క్లోజయింది. యూరోప్ మార్కెట్లు ఒకటిన్నర శాతం దాకా కోల్పోయాయి. జపాన్, హాంకాంగ్, సింగపూర్ సూచీలు మాత్రం అరశాతం లాభపడుతున్నాయి.