: అమ్మపాలు అమృతమే
చంటిపిల్లలకు అమ్మపాలు అమృతంతో సమానం. ఎందుకంటే పుట్టిన వెంటనే ముర్రుపాలు తాగించడం వల్ల పిల్లలకు పలు వ్యాధులు రాకుండా వారిలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని అందరికీ తెలిసిందే. అయితే అమ్మపాలు తాగడం వల్ల పిల్లల్లో చురుకుదనం కూడా ఎక్కువగా ఉంటుందని తాజా పరిశోధనలో తేలింది. పసితనంలో అమ్మపాలు తాగిన పిల్లల్లో మిగిలిన వారితో పోల్చుకుంటే వారిలో మెదడు పనితీరు, ఎదుగుదల వంటివి బాగున్నాయని దాని ఫలితంగా వారు అన్ని విషయాల్లోను చురుగ్గా ఉంటారని తేలింది.
అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు నాలుగేళ్ల లోపు వయసున్న పిల్లలను ఈ సందర్భంగా పరిశీలించారు. వీరిలో అతి ఎక్కువ కాలం అమ్మపాలు తాగిన పిల్లల మెదడు చురుగ్గా పనిచేసిందని, వీరిలో పదాలు పలకడానికి, భాష నేర్చుకోవడానికి, భావోద్వేగాలకు సంబంధించి మెదడులో స్పందించే భాగాల ఎదుగుదల సంపూర్ణంగా ఉందని తేలింది. అలాగే తక్కువ కాలం అమ్మపాలు తాగిన పిల్లల్లో మెదడు ఎదుగుదల తీరు తక్కువగా ఉందని తేలింది. అమ్మపాలు ఎక్కువ కాలం తాగిన పిల్లలు మిగిలిన వారితో పోల్చుకుంటే ఏ విషయాన్నైన త్వరగా అర్ధం చేసుకుంటారని, వెంటనే స్పందిస్తారని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి మన పిల్లలు చక్కగా ఆరోగ్యంగా ఎదగాలంటే అమ్మపాలు ఎక్కువకాలం పట్టించాల్సి ఉంది.