: ఐరన్ తీసుకుంటే బిడ్డ పెరుగుతుంది
గర్భవతులుగా ఉండే తల్లులు రోజూ ఐరన్ కలిగివుండే ఆహారం తీసుకోవడం వల్ల కడుపులో ఉన్న బిడ్డ బరువు పెరుగుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. ప్రతిరోజూ 66 మిల్లీ గ్రాముల ఐరన్ తీసుకోవడం వల్ల కడుపులో ఉన్న బిడ్డ కూడా చక్కగా బరువు పెరుగుతుందని యుకె అండ్ యుఎస్ కు చెందిన పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది.
గర్భవతులు ఐరన్ తీసుకోవడం వల్ల తల్లి శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరగడంతోబాటు రక్తహీనతను కూడా నివారిస్తుంది. అంతేకాకుండా నెలలు పూర్తి కాకుండానే ప్రసవం కలగడం వంటివి తగ్గుతాయి. ఈ అధ్యయనంలో ప్రతిరోజూ గర్భవతులు ఐరన్ తీసుకోవడం వల్ల తక్కువ బరువు కలిగిన పిల్లలు పుట్టడం, ముందుగానే ప్రసవం కావడం వంటి పలు సమస్యలను నివారించవచ్చని చెబుతున్నారు. తక్కువ బరువు కలిగిన పిల్లలు తర్వాత కాలంలో పలు ఆరోగ్య పరమైన సమస్యలను ఎదుర్కొంటారు. కాబట్టి ప్రతిరోజూ ఐరన్ తీసుకోవడం వల్ల ఇటు బిడ్డ బరువు పెరగడంతోబాటు అటు తల్లికి రక్తహీనత కూడా లేకుండా ఉంటుంది.