: మెదడు వ్యాధుల గుట్టు తెలిసింది!


మనిషి శరీరంలో కీలక అవయవాలైన గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, కిడ్నీలు ఎలా వ్యాధుల బారిన పడతాయో.. మెదడు కూడా అలాగే రోగగ్రస్థమవుతుంది. మెదడును పట్టి పీడించే వ్యాధులకు కారణమని భావిస్తున్న ఓ అరుదైన వైరస్ ను ఆక్స్ ఫర్డ్ శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. అయితే, మెదడు వ్యాధులు ఈ వైరస్ పనేనా అన్న విషయం ఇంకా పరిశోధనల స్థాయిలోనే ఉందని వారు తెలిపారు. వియత్నామ్ లో జరిపిన పరిశోధనల్లో భాగంగా 644 మంది మెదడు ఇన్ ఫెక్షన్లతో బాధపడుతున్న వ్యక్తులపై ప్రయోగాలు జరుపగా.. వారిలో 28 మందిలో ఈ నూతన వైరస్ కనిపించిందట. ఈ వైరస్ కు శాస్త్రవేత్తలు సీవైసీవీ-వీఎన్ అని నామకరణం చేశారు.

ఈ వైరస్ జన్యుక్రమాన్ని పరిశీలించిన పరిశోధకులు ఇది సిర్కోవిరిడే కుటుంబానికి చెందినదని తేల్చారు. ఈ కుటుంబానికి చెందిన వైరస్ లు ఇప్పటివరకు పందుల్లోనూ, పలు రకాల పక్షుల్లోనూ కనిపించేవట. తాజాగా మనుషుల్లోనూ వీటి ఉనికి బయటపడడం పట్ల ఆక్స్ ఫర్డ్ పరిశోధకులు ఆందోళన చెందుతున్నారు. అయితే, మానవాళిపై ఈ వైరస్ లు ఏవిధంగా ప్రభావం చూపుతున్నాయన్న విషయం తెలుసుకోవాల్సి ఉందని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న డాక్టర్ రోజీయర్ వాన్ డూర్న్ అంటున్నారు.

  • Loading...

More Telugu News