: దాతలు ఉన్నతంగా ఉండాలిట!
మనకు అర్జంటుగా రక్తం ఎక్కించుకోవాల్సిన ప్రమాదం జరిగిందనుకోండి... అప్పుడు రక్తం ఎవరిదంటే వారిది ఎక్కించుకోకుండా ఉన్నతమైన గుణాలు కల వారి రక్తం ఎక్కించుకోవాలని చాలామంది కోరుకుంటున్నారట. అంటే దొంగలు, హంతకుల నుండి రక్తాన్ని లేదా ఇతర అవయవాలను స్వీకరిస్తే... అప్పుడు వారి రక్తం మన వ్యక్తిత్వంపై ప్రభావం చూపుతుందని సదరు రోగులు నమ్ముతున్నారని ఒక పరిశోధనలో తేలింది.
మిచిగన్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఈ విషయంపై కొందరు అవయవాలు, రక్తమార్పిడి చేసుకున్న రోగులపై అధ్యయనం చేశారు. దొంగలనుండి, హంతకుల నుండి రక్తం లేదా అవయవాలను స్వీకరించడానికి వీరు సంకోచిస్తున్నట్టు పరిశోధకులు చెబుతున్నారు. అంటే దాతల గుణాలు కూడా స్వీకరించే వారికి మార్పిడి అవుతాయని కొందరు భారతీయులు, అమెరికన్లు భావిస్తున్నట్టుగా ఈ పరిశోధనలో తేలింది. దాతగా ఉన్న వ్యక్తి ఉన్నతమైన వ్యక్తిగా ఉండాలని వారు కోరుకుంటున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.