: షాజహానే కాదు... హసన్‌ కూడా...


గొప్ప ప్రేమికులు ఎవరు అనేది చర్చకు వస్తే ముందుగా షాజహాన్‌ పేరు చెప్పుకుంటారు. అయితే ఇప్పుడు మరో ప్రేమికుడు షాజహాన్‌ తర్వాత పేరుగా చెప్పుకునేందుకు తయారవుతున్నాడు. భర్తలకు భార్యలపై ప్రేమ ఉంటుంది... అయితే ఎంతగా అనేది చెప్పాలంటే ముందుగా చెప్పుకోవాల్సిన ప్రేమికుడు షాజహాన్‌. తన భార్యపై ఆయనకున్న ప్రేమకు చిహ్నంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తాజ్‌మహల్‌ను కట్టించాడు. దీంతో ప్రేమకు చిహ్నంగా నాటినుండి నేటి వరకూ తాజ్‌మహల్‌నే చెప్పుకుంటారు. అయితే ఈ ఆధునిక కాలంలో భార్యపై భర్తకు గల ప్రేమకు ఎలాంటి నిదర్శనాలు చెప్పలేము. అయితే హసన్‌ మాత్రం తన భార్య కోరికను తీర్చేందుకు మరో మినీ తాజ్‌మహల్‌ను కట్టించాడు. షాజహాన్‌ సరసన హసన్‌ కూడా ప్రేమను వ్యక్తం చేసే విషయంలో నిలిచాడు.

హాసన్‌ కాదరీ, తాజమ్ములీ బేగం దంపతులకు పిల్లలు లేరు. ఇది వారిద్దరికీ పెద్ద దిగులుగా ఉండేది. దీంతో 2011లో బేగం చనిపోతూ తమకు పిల్లలు లేరని, తాము చనిపోయిన తర్వాత అందరూ తమని మరచిపోతారని, వంశాన్ని నిలబెట్టే వారసులు లేరని బాధపడింది. దీంతో చలించిన హసన్‌ తన భార్యకు చక్కగా మినీ తాజ్‌మహల్‌ నిర్మించి ఇవ్వాలనుకున్నాడు. మొత్తం 5000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక మినీ తాజ్‌మహల్‌ను నిర్మించేందుకు పూనుకున్నాడు. మాజీ పోస్ట్‌మాస్టర్‌ అయిన హసన్‌ తన ఉద్యోగ విరమణ తర్వాత వచ్చిన సొమ్మును, పెన్షన్‌ డబ్బును, ఇంకా భార్య నగలు, భూమి అమ్మగా వచ్చిన సొమ్ము ఇలా అంతా కూడా ఆ మినీ తాజ్‌మహల్‌ కోసం ఖర్చు చేశాడు. ఇప్పటికే సుమారు 12 లక్షల రూపాయలు ఖర్చయింది. ఈ మహల్‌ నిర్మాణానికి పాపం హసన్‌ తీవ్ర ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొనాల్సి వచ్చింది. అయినా కూడా ఎవరి వద్దనుండి ఒక్క రూపాయి కూడా విరాళంగా స్వీకరించలేదట. గత ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించిన ఈ భవనం త్వరలో పూర్తి కానుంది. తాను చనిపోయిన తర్వాత తన భార్య పక్కనే తనను కూడా సమాధి చేయాలని హసన్‌ కోరుతున్నాడు. ఇప్పుడు చెప్పండి... భార్యపై ప్రేమ విషయంలో షాజహాన్‌ తర్వాత హసన్‌ పేరు చెప్పుకోవచ్చు కదూ...!

  • Loading...

More Telugu News