: 'ఆల్ ఈజ్ వెల్' అంటున్న కమల'నాథు'డు
బీజేపీలో రేగిన సంక్షోభం సమసిపోయిందంటున్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్. వివాదాలన్నీ ఇక గతం అంటూ, పార్టీలో ప్రస్తుతం 'ఆల్ ఈజ్ వెల్' అని పేర్కొన్నారు. ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో రాజ్ నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, అద్వానీ అసంతృప్తికి మోడీ కారణం కాదని అన్నారు. అద్వానీ అలకకు వేరే కారణాలున్నాయని చెప్పారు.
మోడీని బీజేపీ ప్రచార సారథిగా నియమిస్తున్నట్టు గోవా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రకటించడం అద్వానీకి కోపం తెప్పించిన సంగతి తెలిసిందే. దాంతో, ఆయన పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించగా.. అగ్రనేతల బుజ్జగింపులతో మెత్తబడ్డారు.
ఇక, వచ్చే ఎన్నికల్లో మోడీ ప్రధాని అభ్యర్థిత్వంపైనా రాజ్ నాథ్ స్పందించారు. ప్రజలనాడిని బట్టి నడుచుకుంటామని స్పష్టం చేశారు. మోడీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జేడీయూ.. బీహార్లో బీజేపీతో తెగదెంపులు చేసుకోవడంతో పాటు ఎన్డీఏకి సైతం గుడ్ బై చెప్పింది. ఈ క్రమంలో జేడీయూ అధినేత శరద్ యాదవ్ ఎన్డీఏ కన్వీనర్ పదవికి రాజీనామా చేశారు.