: సీఎంగారి ఇలాకా అని చెప్పి టోకరాకు యత్నం


ఢిల్లీలో ఓ యువతి అతితెలివి ప్రదర్శించి కటకటాలపాలైంది. తాను ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ బంధువునని చెప్పి ఓ నగల దుకాణం యజమానికి టోకరా ఇచ్చే ప్రయత్నంలో పోలీసుల చేతచిక్కింది. విషయం ఏమిటంటే.. శిఖా భాటియా అనే అమ్మాయి ఇక్కడి లజ్ పత్ నగర్లోని జిందాల్ డైమండ్స్ దుకాణానికి ఫోన్ చేసి తాను సీఎం షీలా దీక్షిత్ కు చుట్టాన్నని.. తూర్పు ఢిల్లీ ఎంపీ సందీప్ దీక్షిత్ భార్యనని, తన పేరు మోనా దీక్షిత్ అని పరిచయం చేసుకుంది. తనకు ఓ జత వజ్రాల గాజులు కావాలని షాపు యజమానికి చెప్పింది.

తాను అర్జెంటుగా కాన్పూర్ పయనమయ్యేందుకు, ఎయిర్ పోర్టుకు వెళుతున్నానని, తన బదులు మరో వ్యక్తి షాపు వద్దకు వస్తాడని, అతడికి గాజులు ఇవ్వాలని పేర్కొంది. ఈమె మాటలు కాస్త సందేహాస్పదంగా తోచడంతో వెంటనే దుకాణదారు ఎంపీ సందీప్ దీక్షిత్ కార్యాలయానికి ఫోన్ చేసి మోనా దీక్షిత్ పై ఆరా తీశారు. అలాంటి మహిళ ఎవరూ తమకు తెలియదని ఎంపీ కార్యాలయ సిబ్బంది స్పష్టం చేశారు. దీంతో, ఆయన పోలీసులకు సమాచారం అందించారు. ఆ కిలాడీ యువతిని పట్టుకునేందుకు పోలీసులు వలపన్నారు.

దుకాణదారుతో ఆ గాజులను కాన్పూర్ లోని ఆ యువతి నివాసానికి పంపారు. అక్కడ ఆమె ఆ వజ్రాల గాజులను తీసుకుని మోనా దీక్షిత్ పేరుతో రూ.3.5 లక్షల నకిలీ చెక్ ను ఇచ్చింది. ఎప్పుడెప్పుడా అని కాచుక్కూచున్న పోలీసులు వెంటనే ఆ కిలాడీని అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై వంచన, మోసం, ఫోర్జరీ అభియోగాలు మోపారు. కాగా, పోలీసుల విచారణలో ఈ యువతి పేరు శిఖా భాటియా అని ఆమె పుణేలో సింబయోసిస్ యూనివర్శిటీలో ఎంబీఏ విద్యార్థి అని తేలింది.

  • Loading...

More Telugu News