: ఒడిశా ఓటర్లకు సుడి తిరిగింది!
ఒడిశా ఓటర్లపై ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ తాయిలాల వల విసురుతున్నారు! ఖరీదైన వస్తువులను సైతం ఉచితంగా అందజేస్తున్నారు. అక్కడి అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తుండడమే అందుకు కారణం. ల్యాప్ టాప్ లు, బూట్లు, గొడుగులు, సెల్ ఫోన్లు.. ఇలా ప్రజలకు వరాలమీద వరాలు ప్రకటిస్తున్నారు. తాజాగా మయూర్ భంజ్ జిల్లాలో రైతులకు ఒకేసారి 20 వేల మొబైల్ ఫోన్లు పంపిణీ చేసి, పట్టు నిలుపుకునే ప్రయత్నం చేశారు నవీన్ పట్నాయక్. అధికారం నిలబెట్టుకునేందుకే ఈ పాట్లు అని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదేమో.
కాగా, ఉచిత ఫోన్ అందుకున్న ఓ గిరిజన రైతు మాట్లాడుతూ.. ఇలాంటి ఉచిత సరుకు ఓటుపై ప్రభావం చూపదని వ్యాఖ్యానించాడు. ఇది వింటే పట్నాయక్ గారు ఏమంటారో? కానీ, విపక్షాలు మాత్రం సీఎంపై కారాలుమిరియాలు నూరుతున్నాయి. ప్రజాధనాన్ని ఓట్లకోసం వెచ్చించే అధికారం సీఎంకి లేదని ప్రతిపక్ష కాంగ్రెస్ నేత జయదేవ్ జెనా అన్నారు. ఈ విషయమై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.