: గర్భవతులు ప్లాస్టిక్ సీసాల్లో నీళ్లు తాగవద్దు!
గర్భవతులు ప్లాస్టిక్ సీసాల్లోని నీళ్లు తాగవద్దని, అలా తాగేవారికి పుట్టే పిల్లలకు వారి వృద్ధాప్యంలో క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సహజంగానే ప్లాస్టిక్ డబ్బాల్లో నిల్వ చేసిన ఆహార పదార్ధాలను వాడవద్దని ఇప్పటికే శాస్త్రవేత్తలు హెచ్చరించివున్నారు. ఇప్పుడు ప్లాస్టిక్ బాటిళ్లలోని నీళ్లను గర్భవతులు తాగడం వల్ల వారికి పుట్టే పిల్లలకు వృద్ధాప్యంలో క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక తాజా అధ్యయనంలో బయటపడింది. ఈ ప్రమాదం మగపిల్లలకు ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అమెరికాలోని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలో ప్లాస్టిక్ సీసాల తయారీలో సాధారణంగా ఉపయోగించే బైష్ఫెనాల్ ఏ (బీపీఏ) అనే రసాయనం కారణంగా బాటిళ్లలోని నీటిని తాగే గర్భవతులకు పుట్టే పిల్లలకు వృద్ధాప్యంలో క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని తేల్చారు. ఈ బీపీఏ ప్రభావం వల్ల మనిషి ప్రొస్టేట్ కణజాలంలో కేన్సర్ తలెత్తే ప్రమాదముందని తమ పరిశోధనలో వెల్లడైందని ఈ పరిశోధనలో పాల్గొన్న గెయిల్ ప్రిన్స్ తెలిపారు. బీపీఏ కారణంగా చిన్నారుల్లో ఎదిగే దశలోనే ప్రొస్టేట్ మూలకణాలు ఈస్ట్రోజన్ పట్ల సున్నితత్వాన్ని కలిగి ఉంటాయని, ఇది కొనసాగి ప్రొస్టేట్ క్యాన్సర్ కణజాలంలో స్థిరపడిపోతుందని ఆయన తెలిపారు.