: 'చిరుత' రోబోకు వేగం కూడా ఎక్కువే!
రోబోలు సహజంగా ఎలా ఉంటాయి... ఏదో మనుషుల్లాగానో... లేదా ఏదైనా బొమ్మలనో పోలి ఉంటాయి. అయితే, ఈ రోబో మాత్రం నాలుగు కాళ్లను కలిగి చూసేందుకు చిరుత లాగా ఉంటుంది. అంతేకాదు, పరుగులో కూడా అంతే వేగాన్ని కూడా కలిగివుందట. స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు ఒక నాలుగు కాళ్ల రోబోను తయారు చేశారు. ఈ రోబో చిరుత పిల్లలాగా ఉంటుంది. అంతేకాదు, పరిగెత్తడం మొదలు పెడితే మాత్రం చాలా వేగంగా పరిగెత్తుతుందంటున్నారు దీన్ని తయారు చేసిన శాస్త్రవేత్తలు. పరుగెత్తేటప్పుడు పిల్లిలా కనిపించే ఈ రోబో పేరు 'క్యాట్‌బోట్'.
నాలుగు కాళ్లతో ఉండే ఈ క్యాట్‌బోట్ చిన్నదిగాను, తేలిగ్గాను ఉంటుంది. పరుగులు తీయడంలో మాత్రం చాలా వేగమట. అన్వేషణ, ఇతర సహాయక చర్యలకు ఈ బుల్లి 'క్యాట్‌బోట్' చాలా చక్కగా ఉపయోగపడుతుందని దీన్ని రూపొందించిన స్విట్జర్లాండ్‌కు చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ రోబో ప్రత్యేకతంతా దాన్ని కాళ్లలోనే ఉందట. దాని కాళ్లను చాలా అద్భుతంగా, ఎంతో వైవిధ్యంగా ఉండేలా డిజైన్ చేయడం వల్లే అది అంత వేగంగా పరుగులు తీయగలుగుతోందట. ఇది ఎంత వేగంగా అంటే ఒక సెకను కాలంలో తన శరీరం పొడవు కంటే ఏడు రెట్లు ఎక్కువ దూరం పరిగెత్తుతుంది. ప్రకృతి వైపరీత్యాలు, ఇతర ఆపద సమయాల్లో దీన్ని ఉపయోగించాలనే లక్ష్యంతో శాస్త్రవేత్తలు దీన్ని రూపొందిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఇది ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉంది. పూర్తయితే మాత్రం ప్రమాద సమయాల్లో సహాయక చర్యలను అందించేందుకు ఇది ఎంతగానో ఉపకరిస్తుందంటున్నారు శాస్త్రవేత్తలు.