: అఖిలేశ్ 'డ్రీమ్ ప్రాజెక్టు'పై కన్నేసిన మైక్రోసాఫ్ట్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ డ్రీమ్ ప్రాజెక్టు అయిన విద్యార్థులకు ఉచితంగా ల్యాప్ టాప్ ల పంపిణీ పథకం సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ను ఆకర్షించింది. ముంబయికి చెందిన ఇండియన్ మార్కెట్ రీసెర్చ్ బ్యూరో (ఐఎంఆర్ బీ)తో కలిసి ఈ పథకాన్నినిశితంగా అధ్యయనం చేయాలని మైక్రోసాఫ్ట్ భావిస్తోంది. గతేడాది జరిగిన యూపీ ఎన్నికల్లో అఖిలేశ్ పార్టీ ఉచిత ల్యాప్ టాప్ లు అందజేస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి రాగానే హామీ నిలబెట్టుకున్న అఖిలేశ్ ఇంటర్మీడియట్ పాసైన విద్యార్థులకు ల్యాప్ టాప్ లు పంపిణీ చేశారు.
కాగా, మైక్రోసాఫ్ట్.. ఈ పథకం తీరుతెన్నులు, అది ఎలా అమలవుతోంది?, అందులో ఇన్ స్టాల్ చేసిన తమ సాఫ్ట్ వేర్లు ఎలా ఉపయోగపడుతున్నాయి? వంటి విషయాలపై అధ్యయనం చేస్తుంది. ఇందుకోసం ఓ బృందం యూపీ సమాచార సాంకేతిక శాఖ, ఎలక్ట్రానిక్స్ విభాగం అధికారులతో భేటీ అవనుంది.