: దూసుకెళుతోన్న 'చెన్నై ఎక్స్ ప్రెస్'
షారూఖ్ ఖాన్, దీపిక పదుకొనే కాంబినేషన్లో వస్తోన్న 'చెన్నై ఎక్స్ ప్రెస్' ఇంటర్నెట్లో దూసుకెళుతోంది. ట్రైలర్ విడుదల చేసిన నాలుగు రోజుల్లోనే యూట్యూబ్ లో 20 లక్షల హిట్స్ ను స్వంతం చేసుకుందీ యాక్షన్-కామెడీ ఎంటర్ టైనర్. షారూఖ్, దీపిక జంటగా నటించడం ఇది రెండోసారి. ఇంతకుముందు వీరిద్దరూ 2007 లో 'ఓం శాంతి ఓం'లో నాయకానాయికలుగా కనిపించారు. కాగా, 'చెన్నై ఎక్స్ ప్రెస్' దర్శకుడు రోహిత్ శెట్టికి షారూఖ్ తో పనిచేయడం ఇదే తొలిసారి.
ఇక చిత్ర ఇతివృత్తానికొస్తే.. ముంబయి నుంచి రామేశ్వరం ప్రయాణించిన ఓ యువకుడి కథ ఇది. ఆ యువకుడు (షారూఖ్) ఓ డాన్ కుమార్తె (దీపిక)తో ప్రేమలో పడతాడు. తన ప్రేమను గెలిపించుకునే క్రమంలో హీరో పడే పాట్లు తెరపైన చూడాల్సిందేనట. షారూఖ్ కు చెందిన రెడ్ ఛిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్, యూటీవీ మోషన్ పిక్చర్స్ సంయుక్త భాగస్వామ్యంలో నిర్మాణం జరుపుకున్న 'చెన్నై ఎక్స్ ప్రెస్' ఆగస్టు 8న విడుదల కానుంది.