బిల్డింగ్‌ ఏమో 32 అంతస్తులు... 34వ ఫ్లోర్‌లో ఫ్లాట్ అమ్మకం... చైనాలో వింత మోసం!

China Real Estate Scam Flat Sale on 34th Floor of 32 Storey Building
  • చైనాలో 32 అంతస్తుల భవనంలో 34వ ఫ్లోర్‌లో ఫ్లాట్ కొన్న వ్యక్తి
  • తక్కువ ధరకే వస్తుండటంతో 2013లో కొనుగోలు
  • లేని ఫ్లోర్ లో ఫ్లాట్ అమ్మి మోసం చేసిన నిర్మాణ సంస్థ
  • డబ్బు తిరిగివ్వాలని పదేళ్లుగా న్యాయపోరాటం
  • చైనాలో గ్రే మార్కెట్ ఇళ్ల కొనుగోళ్లపై మొదలైన చర్చ
చైనాలో వెలుగుచూసిన ఒక వింత మోసం విస్మయానికి గురిచేస్తోంది. 32 అంతస్తులు మాత్రమే ఉన్న ఒక భవనంలో, ఏకంగా 34వ అంతస్తులో ఫ్లాట్‌ కొనుగోలు చేసిన ఒక వ్యక్తి, తన నగదు తిరిగి పొందడం కోసం దశాబ్ద కాలంగా న్యాయపోరాటం చేస్తున్నాడు. చౌకగా ఇల్లు సొంతం చేసుకోవాలన్న అతని ఆకాంక్ష, చివరకు తీరని వేదనగా మారింది.

వివరాల్లోకి వెళితే, షెన్ అనే వ్యక్తి 2013లో షాంగ్జీ ప్రావిన్స్ రాజధాని జియాన్ పరిసరాల్లో ఒక ఫ్లాట్‌ను కొనుగోలు చేశాడు. అప్పట్లో మార్కెట్ ధరలతో పోలిస్తే కేవలం మూడో వంతు ధరకే, అంటే చదరపు మీటరుకు 2,646 యువాన్లకే (సుమారు రూ. 37,000) ఫ్లాట్ లభించడంతో ఆయన వెంటనే ఆసక్తి చూపాడు. అయితే, ఆ ఆస్తికి 'పరిమిత ఆస్తి హక్కులు' మాత్రమే ఉండటం ఈ తక్కువ ధరకు ప్రధాన కారణం. సాధారణంగా ఇటువంటి భవనాలను పూర్తిస్థాయి ప్రభుత్వ అనుమతులు లేకుండానే నిర్మిస్తుంటారు.

ఫ్లాట్ కొనుగోలు సమయంలో షెన్ 1,17,700 యువాన్లను డౌన్‌ పేమెంట్‌గా చెల్లించాడు. 2015 నాటికి ఫ్లాట్ అప్పగిస్తామని హామీ ఇచ్చిన నిర్మాణ సంస్థ, ఆ తర్వాత నిర్మాణాన్ని ఆలస్యం చేస్తూ వచ్చింది. చివరకు 2017లో అసలు విషయాన్ని బయటపెట్టి షాకిచ్చింది. ఆ భవనంలో కేవలం 32 అంతస్తులు మాత్రమే ఉన్నాయని, అసలు 34వ అంతస్తు అనేదే లేదని వెల్లడించింది. ప్రత్యమ్నాయంగా 32వ అంతస్తులో మరో ఫ్లాట్ ఇస్తామని తొలుత ప్రతిపాదించినప్పటికీ, షెన్ మిగిలిన మొత్తాన్ని వెంటనే చెల్లించలేకపోవడంతో దానిని కూడా వేరొకరికి విక్రయించారు.

అప్పటి నుంచి తన నగదును తిరిగి రాబట్టుకునేందుకు షెన్ నిరంతరం పోరాడుతూ ఉన్నాడు. నిర్మాణ సంస్థ 2020లో 20,000 యువాన్లు, 2022లో 50,000 యువాన్లు చెల్లించి చేతులు దులుపుకుంది. దీంతో బాధితుడు ఆర్బిట్రేషన్‌ను ఆశ్రయించగా, బకాయి ఉన్న 47,700 యువాన్లతో పాటు వడ్డీ కింద మరో 27,000 యువాన్లు చెల్లించాలని ఆదేశాలు వచ్చాయి. అయినప్పటికీ, ఇప్పటివరకు ఆయనకు పూర్తి మొత్తం అందలేదు.
Go Back to Shorts
Shen
China Real Estate Scam
Xi'an Property Fraud
34th Floor Flat Scam
China Building Construction Fraud

More Telugu News