ఢిల్లీ అగ్నిప్రమాదం: కుటుంబంలోని 8 మంది మృతి... తన వాళ్లు ఇక లేరని తెలియని వృద్ధుడు కూడా కన్నుమూత
- ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతి
- ఆసుపత్రిలో ఉన్న కుటుంబ పెద్దను చూసేందుకు వచ్చి ప్రమాదంలో చిక్కుకున్న బంధువులు
- ఈ విషయం తెలియకుండానే, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధుడు కన్నుమూత
- ప్రమాదంతో గుర్గావ్ అగర్వాల్ కుటుంబంలో ఎవరూ మిగలకుండా పోయిన వైనం
- హోటల్ యాజమాని, వంట మనిషిని అరెస్ట్ చేసిన పోలీసులు
శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న రాధే శ్యామ్ అగర్వాల్ ఢిల్లీలోని సాకేత్ మాక్స్ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయన్ను చూసుకునేందుకు గురుగ్రామ్‌లో నివసించే ఆయన కుమారుడు వివేక్ అగర్వాల్, కోడలు, మనవరాళ్లతో సహా మొత్తం ఎనిమిది మంది కుటుంబ సభ్యులు ఢిల్లీకి వచ్చారు. వీరంతా ఆసుపత్రికి సమీపంలోని మాల్వియా నగర్లో ఉన్న 'ఫ్లరిష్ స్టే' అనే హోటల్లో బస చేశారు.
జూన్ 3న ఉదయం 8:30 గంటల సమయంలో ఆ హోటల్లోని వంటగదిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో వివేక్ అగర్వాల్ కుటుంబ సభ్యులు ఎనిమిది మందితో పాటు మొత్తం 21 మంది ప్రాణాలు కోల్పోయారు. తన కుటుంబానికి ఇంతటి ఘోరం జరిగిందన్న విషయం తెలియని రాధే శ్యామ్, తన వాళ్లెవరూ పలకరించడానికి రావడం లేదని ఆసుపత్రి సిబ్బందిని నిరంతరం ఆరా తీస్తుండేవారు. చివరకు ఆయన కూడా చికిత్స పొందుతూ మృతి చెందడంతో, ఆ కుటుంబంలో ఒక్కరు కూడా మిగలకుండా పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, హోటల్ యజమాని లవకేశ్ బజాజ్, వంట మనిషి కేశవ్ నేగిని అరెస్ట్ చేశారు. భవన నిర్మాణం, అగ్నిమాపక భద్రతా నిబంధనల్లో తీవ్ర లోపాలు ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ దుర్ఘటనతో గురుగ్రామ్‌లోని అగర్వాల్ కుటుంబ నివాసం మూగబోయింది.