దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలి: రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సవాల్

Kishan Reddy challenges Revanth Reddy for an open debate on Telangana development
  • అభద్రతా భావంతో రేవంత్ వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారన్న కిషన్ రెడ్డి
  • రాష్ట్ర అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టులపై చర్చకు రావాలని సవాల్
  • ఒక్క ప్రాజెక్టును అడ్డుకున్నట్టు నిరూపించినా రాజీనామా చేస్తానన్న కిషన్ రెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీల వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై, కేంద్ర ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన... అహంకారం, అభద్రతా భావం, తీవ్ర నిరాశతోనే రేవంత్ రెడ్డి వ్యక్తిగత విమర్శలకు, తప్పుడు ప్రచారాలకు దిగుతున్నారని ధ్వజమెత్తారు.


"కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందంటే అది రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీల దయాదాక్షిణ్యాల వల్లేమీ కాదు. నేను అంబర్‌పేట్, సికింద్రాబాద్ ప్రజల ఆశీస్సులతో ఢిల్లీకి వెళ్లాను. రేవంత్ రెడ్డికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. తెలంగాణ ప్రజలకు, నా నియోజకవర్గానికి, నా పార్టీకి మాత్రమే నేను జవాబుదారీని" అని స్పష్టం చేశారు.


తెలంగాణ అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. "రేవంత్ రెడ్డికి దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలి. ప్రెస్ క్లబ్ అయినా సరే లేదా అమరవీరుల స్తూపం ముందైనా సరే నేను చర్చకు సిద్ధం" అని ప్రకటించారు. తాను తెలంగాణకు రావాల్సిన ఏ ఒక్క ప్రాజెక్టునైనా అడ్డుకున్నానని నిరూపిస్తే తక్షణమే రాజీనామా చేస్తానని, దీనిపై సీనియర్ జర్నలిస్టులతో ఒక కమిటీని వేసి విచారణ జరిపించాలని సవాల్ విసిరారు.


తుమ్మిడిహట్టి ప్రాజెక్టు, మెట్రో ఫేజ్-2 పై సీఎం చేసిన ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. తుమ్మిడిహట్టి అపాయింట్‌మెంట్ వ్యవహారంపై రేవంత్ రెడ్డి ఆధారాలు లేని ఆరోపణలు మానేసి, పద్ధతిగా అధికారికంగా అపాయింట్‌మెంట్ కోరాలని సూచించారు. గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు తమ అవినీతి, తప్పుడు నిర్వహణతో మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను అప్పుల పాలు చేశాయని కిషన్ రెడ్డి విమర్శించారు.

Go Back to Shorts
Kishan Reddy
Revanth Reddy
Telangana Politics
Open Debate Challenge
Hyderabad Metro Phase 2
BJP Congress Telangana

More Telugu News