బెల్లం తింటే శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయా?
- బెల్లం శ్వాస సమస్యలను నయం చేయలేదంటున్న నిపుణులు
- గొంతు గరగరకు తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని వెల్లడి
- కఫాన్ని కరిగించే గుణం బెల్లంలో ఉంటుంది
- ఆస్తమా వ్యాధికి బెల్లం మందు కాదు
- షుగర్ ఉన్నవాళ్లు బెల్లానికి దూరంగా ఉండాలి
‘ఎన్విరాన్‌మెంటల్ హెల్త్ పర్‌స్పెక్టివ్స్’ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. బెల్లం శరీరంలో ఓ సహజ క్లీనర్‌గా, కఫాన్ని కరిగించేలా పనిచేస్తుంది. ఇది ఊపిరితిత్తుల్లో చేరిన శ్లేష్మాన్ని కరిగిస్తుంది. పీల్చిన కాలుష్య కారకాలను బయటకు పంపుతుంది. ధూళి, పొగ ఎక్కువగా ఉండే వాతావరణంలో పనిచేసే వారికి బెల్లం ఒక రక్షణ కవచంలా ఉపయోగపడుతుందని జంతువులపై జరిపిన కొన్ని పరిశోధనల్లో తేలింది.
బెల్లంలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు స్వల్ప పరిమాణంలో ఉంటాయి. శీతాకాలంలో లేదా వాతావరణం మారినప్పుడు వచ్చే జలుబు, గొంతు గరగరను తగ్గించడానికి బెల్లాన్ని వేడి నీళ్లలోగానీ, అల్లం లేదా ఇతర మూలికలతో కలిపి తీసుకోవడం వల్ల శ్వాసనాళాల్లో ఉపశమనం లభిస్తుంది.
బెల్లం తింటే ఊపిరితిత్తుల పనితీరు నేరుగా మెరుగుపడుతుందని లేదా ఆస్తమా, సీఓపీడీ లాంటి తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులు నయమవుతాయని చెప్పడానికి ఎలాంటి బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు. ఇది కేవలం గొంతు మంట, చిన్నపాటి దగ్గు, కఫం వంటి తాత్కాలిక లక్షణాల నుంచి మాత్రమే ఉపశమనాన్ని ఇస్తుంది తప్ప.. తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులకు ఇది ప్రత్యామ్నాయ చికిత్స కాదని స్పష్టం చేస్తున్నారు.
అలర్జీలు, ఇన్‌ఫెక్షన్లు, గుండె జబ్బులు, వాయు కాలుష్యం వంటి రకరకాల కారణాల వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఊపిరి ఆడకపోవడం, పిల్లి కూతలు రావడం, ఛాతీలో బిగుతుగా ఉండటం, తగ్గని దగ్గు వంటివి తీవ్రమైన అనారోగ్య లక్షణాలు. ఇలాంటి సమయంలో వైద్యులను సంప్రదించకుండా కేవలం బెల్లం లాంటి ఇంటి చిట్కాలపైనే ఆధారపడితే ప్రాణాలకే ప్రమాదం వాటిల్లవచ్చు.
పంచదారతో పోలిస్తే బెల్లం ఆరోగ్యకరమైనదే అయినప్పటికీ.. దీనిలోనూ చక్కెర శాతమే ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తక్షణమే పెంచుతుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు, ఊబకాయంతో బాధపడేవారు, బరువు తగ్గాలనుకునే వారు బెల్లాన్ని చాలా పరిమితంగా తీసుకోవాలి. మితిమీరి తింటే లాభం కంటే నష్టమే ఎక్కువ.