దశాబ్దాల విధానానికి స్వస్తి.. అణుబాంబులను మోహరించిన భారత్‌!

India Deploys Nuclear Warheads Ending Decades Old Policy
  • 12 అణ్వస్త్రాలను ప్రయోగానికి సిద్ధంగా ఉంచిన భారత్‌
  • సిప్రి నివేదికలో సంచలన విషయాలు
  • భారత్‌ వద్ద దాదాపు 190 అణు బాంబులు
  • కంటైనర్లలో సిద్ధంగా ఉంచే సాంకేతికతతోనే సాధ్యం
  • ‘నో ఫస్ట్‌ యూజ్‌’లో మార్పు లేదు
భారతదేశ రక్షణ, అణు ఆయుధ విధానంలో చరిత్రాత్మక మార్పు చోటుచేసుకున్నట్లు సమాచారం. దేశ రక్షణ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా భారత్ ప్రయోగించేందుకు సిద్ధంగా ఉండేలా 12 అణుబాంబులను మోహరించినట్లు అంతర్జాతీయ ఆయుధాల పర్యవేక్షణ సంస్థ ‘స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్’ (సిప్రి) తన తాజా నివేదికలో సంచలన విషయాన్ని వెల్లడించింది.

దశాబ్దాలుగా అనుసరిస్తున్న వ్యూహాత్మక విధానాన్ని పక్కనబెట్టి భారత్ ఈ అడుగు వేయడం అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. సాధారణంగా శాంతి సమయాల్లో భారత్ తన అణుబాంబులను, వాటిని ప్రయోగించే క్షిపణులు లేదా యుద్ధ విమానాలను వేర్వేరు ప్రాంతాలలో భద్రపరుస్తుంది. కానీ ఇప్పుడు తొలిసారిగా అణుబాంబులను నేరుగా ప్రయోగించే వ్యవస్థలతో అనుసంధానించి, సైనిక స్థావరాల్లో లేదా భూగర్భ క్షిపణి కేంద్రాల్లో యుద్ధానికి సిద్ధంగా ఉంచినట్లు సిప్రి నివేదిక పేర్కొంది.

జూన్ 8న విడుదలైన ఈ నివేదిక ప్రకారం.. జనవరి 2026 నాటికి భారతదేశం వద్ద ఉన్న మొత్తం అణు ఆయుధాల సంఖ్య దాదాపు 190కి చేరింది. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య కొద్దిగా పెరిగింది. వీటిని భూమి, గగనతలం, సముద్రం.. ఈ మూడు మార్గాల ద్వారా ప్రయోగించేలా భారత్ తన సామర్థ్యాన్ని ఆధునికీకరించుకుంది. ముఖ్యంగా అణు జలాంతర్గాముల్లో ఈ సరికొత్త వ్యూహాత్మక అణుబాంబులను మోహరించి సముద్ర గర్భంలో నిరంతర నిఘా నిర్వహిస్తున్నట్లు నివేదిక స్పష్టం చేసింది.

క్షిపణులను ముందే కంటైనర్లలో సిద్ధంగా ఉంచే సాంకేతికతను భారత్ ఇటీవల అభివృద్ధి చేయడం వల్లే.. శాంతి సమయంలోనూ క్షిపణులతో అణుబాంబులను అనుసంధానించే ఈ విధానం సాధ్యపడిందని రక్షణ నిపుణులు భావిస్తున్నారు. శత్రువుల నుంచి ముప్పు పొంచి ఉన్నప్పుడు అత్యంత వేగంగా స్పందించేందుకు ఈ వ్యూహం ఉపయోగపడుతుంది.

అయితే అణ్వస్త్రాలను మోహరించినప్పటికీ భారత్ తన ప్రాథమిక సూత్రమైన ‘నో ఫస్ట్ యూజ్’ విధానానికే కట్టుబడి ఉందని నివేదిక స్పష్టం చేసింది. దీని ప్రకారం భారతదేశం ఏ దేశంపైనా మొదటగా అణు దాడి చేయదు. ఒకవేళ శత్రుదేశం భారత్‌పై గానీ, భారత బలగాలపై గానీ అణు దాడికి పాల్పడితే.. దానికి ప్రతీకారంగా మాత్రమే భారత్ తన అణు ఆయుధాలను ప్రయోగిస్తుంది. ఏ దేశంతోనూ ఆయుధాల పోటీ పడకుండా.. కేవలం శత్రువులను నిరోధించేందుకు మాత్రమే పరిమితమైన, అత్యంత ప్రభావవంతమైన అణు సామర్థ్యాన్ని భారత్ కలిగి ఉందని సిప్రి నివేదిక వెల్లడించింది.
Go Back to Shorts
India
Nuclear weapons
SIPRI report
Nuclear warheads deployment
India defense policy
Strategic nuclear forces

More Telugu News