‘మమ్మల్ని కాదు, ఫ్యాక్టరీని కాపాడండి’.. క్షతగాత్రుడి మాటలతో కదిలిపోయాను: మంత్రి లోకేష్

Nara Lokesh moved by injured workers plea to save Vizag Steel Plant
  • విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం
  • విశాఖలో మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శించిన లోకేష్
  • మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా, శాశ్వత ఉద్యోగం హామీ
  • కేంద్ర మంత్రి కుమారస్వామి, రాష్ట్ర మంత్రి లోకేష్ పరామర్శ
  • ప్రమాద కారణాలపై ముగ్గురు సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు
  • ఉక్కు కర్మాగారాన్ని కాపాడాలంటూ ఆసుపత్రిలో క్షతగాత్రుడి విజ్ఞప్తి
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు, క్షతగాత్రులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. బాధితులను పరామర్శించిన అనంతరం నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం కల్పిస్తున్న భరోసాను వివరించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, కాంట్రాక్ట్ లేదా పర్మనెంట్ అనే తేడా లేకుండా మృతుల కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు.

కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ప్రకటించిన వివరాలను లోకేష్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అదనంగా రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రతి కుటుంబానికి అందిస్తున్నట్లు తెలిపారు. నిన్న రాత్రి ఘటనా స్థలాన్ని సందర్శించిన కుమారస్వామి, ఈ మేరకు హామీ ఇచ్చారని చెప్పారు. కుటుంబంలో చదువుకున్న వారికి పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వడంపై కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి నిబంధనల గురించి ప్రస్తావించగా, "అవసరమైతే కేబినెట్‌కు తీసుకెళ్లైనా దీన్ని సాధిస్తాను, ఇది నా బాధ్యత" అని కుమారస్వామి స్పష్టం చేశారని లోకేష్ వివరించారు.

ప్రభుత్వం కేవలం హామీలు ఇచ్చి చేతులు దులుపుకోదని, బాధితులకు శాశ్వతంగా అండగా నిలుస్తుందని లోకేష్ స్పష్టం చేశారు. "నిన్న సాయంత్రం 4:10 గంటలకు ప్రమాదం జరగగానే కలెక్టర్, సీపీ ఘటనా స్థలానికి చేరుకున్నారు. హోం మంత్రి అనిత, ఎంపీ శ్రీభరత్, పల్లా శ్రీనివాస్ కూడా వచ్చారు. కేంద్ర మంత్రులు కుమారస్వామి, వర్మ కూడా వెంటనే స్పందించి పరిస్థితిని సమీక్షించారు. కుమారస్వామి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు, ఈరోజు తేదీ మారేలోపే 8 మంది మృతుల కుటుంబాల అకౌంట్లలోకి తక్షణ సాయంగా రూ.25 లక్షలు జమ చేస్తాం. దీనితో పాటు పీఎఫ్, స్టీల్ ప్లాంట్ నిబంధనల ప్రకారం రావాల్సిన మిగతా పరిహారం కూడా త్వరలోనే అందిస్తాం" అని తెలిపారు.

ప్రమాదం జరిగిన తీరుపై లోతైన దర్యాప్తు జరుగుతుందని లోకేష్ అన్నారు. "ఇది కింద నుంచి లీకవ్వలేదు, పైనుంచి పొంగలేదు. ద్రవ ఉక్కు బయటకు కక్కినట్లుగా ఉంది. దీని వెనుక కారణాలను నిగ్గు తేల్చేందుకు ముగ్గురు సీనియర్ అధికారులతో ఉన్నతస్థాయి కమిటీని వేశారు. వారు ఈరోజే విశాఖ వచ్చి కార్మికులతో మాట్లాడి నివేదిక సమర్పిస్తారు. నివేదిక ఆధారంగా కఠిన చర్యలు ఉంటాయి" అని వివరించారు.

ఈ సందర్భంగా ఆసుపత్రిలో జరిగిన ఓ సంఘటనను లోకేష్ ఉద్వేగంగా పంచుకున్నారు. "గాయపడిన శ్రీనివాస్ అనే కార్మికుడిని పరామర్శిస్తే, ఆయన తన ఆరోగ్యం గురించి కాకుండా 'అయ్యా, మమ్మల్ని కాదు, దయచేసి విశాఖ ఉక్కును కాపాడండి. లక్షలాది కుటుంబాలు దీనిపై ఆధారపడి ఉన్నాయి' అని వేడుకున్నాడు. ఆ మాటలు కార్మికులకు ఫ్యాక్టరీతో ఉన్న అనుబంధాన్ని తెలియజేశాయి. ఆయన మాటలు నన్ను కదిలించాయి" అని అన్నారు.

గతంలో వాజ్‌పేయి, చంద్రబాబు హయాంలో రూ.15 వేల కోట్ల ప్యాకేజీతో ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకున్నామని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా కార్మికుల కుటుంబాలకు అదే విధంగా ఎన్డీయే ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఉత్తరాంధ్రకు రానున్న భారీ పెట్టుబడుల నేపథ్యంలో నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని, యువతకు శిక్షణ ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని లోకేష్ హామీ ఇచ్చారు.
Go Back to Shorts
Nara Lokesh
Vizag Steel Plant
Vizag Steel Plant accident
HD Kumaraswamy
Steel Plant compensation
Andhra Pradesh news

More Telugu News