సొంత తల్లిని, చెల్లిని వెన్నుపోటు పొడిచిన జగన్కు మహిళల గురించి మాట్లాడే అర్హత లేదు: సానా సతీష్
- గతంలో జగన్ నామినేట్ చేసిన రాజ్యసభ సభ్యుల్లో ఒక్క మహిళ కూడా లేదని సతీష్ విమర్శ
- విశాఖ నుంచి విజయమ్మ ఓడిపోయేలా చేశారని ఆరోపణ
- పెయిడ్ మీడియా ద్వారా మహిళలపై విషపూరిత ప్రచారాలు చేయించడమే జగన్ నైజమని విమర్శ
వైసీపీ అధినేత జగన్ మహిళా సమస్యలపై చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభ సభ్యుడు, టీడీపీ నేత సానా సతీష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సొంత తల్లిని, చెల్లిని వెన్నుపోటు పొడిచిన జగన్... మహిళల గురించి మాట్లాడటం అత్యంత విడ్డూరంగా, నైతికత లేని చర్యగా ఉందని మండిపడ్డారు.
జగన్ ఐదేళ్ల పాలనలో జరిగిన కొన్ని వాస్తవాలను సానా సతీష్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న కాలంలో జగన్ 11 మందిని రాజ్యసభకు నామినేట్ చేశారని, అయితే ఆ 11 సీట్లలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా మహిళకు కేటాయించలేదని ఆయన ధ్వజమెత్తారు. ఆయన తల్లి వైఎస్ విజయమ్మ విశాఖపట్నం లోక్సభ స్థానంలో ఓడిపోయేలా చేశారని, ఆ తర్వాత ఆమెతో బలవంతంగా పార్టీ నుంచి రాజీనామా చేయించారని ఆరోపించారు. పెయిడ్ మీడియా ద్వారా మహిళలపై విషపూరిత ప్రచారాలు చేయించడమే జగన్ నైజమని విమర్శించారు.
"తన సొంత తల్లిని, చెల్లిని మోసం చేసిన వ్యక్తి, ఇక రాష్ట్రంలోని మహిళల సంక్షేమం గురించి ఎలా మాట్లాడగలరు?" అని సతీష్ నిలదీశారు.
ఇదే సమయంలో మహానాడు వేదికగా మంత్రి నారా లోకేష్ రాబోయే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తామని ప్రకటించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. లోకేష్ తీసుకున్న ఈ నిర్ణయం జగన్ను తీవ్రమైన ఆత్మరక్షణలో పడేసిందని, ఇప్పుడు ఆయనకు ఏం చేయాలో పాలుపోని నిస్సహాయ స్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు.