మోడ్రన్ డేటింగ్లో కొత్త ట్రెండ్ ‘పఫర్ ఫిషింగ్’.. ఏంటిది?
- రిలేషన్షిప్ సీరియస్ కాగానే దూరమయ్యే వింత ప్రవర్తన
- పఫర్ చేప రక్షణ వలయంలా ప్రవర్తిస్తారు
- చిన్ననాటి భయాలే ఇందుకు ప్రధాన కారణం
- చర్చల నుంచి తప్పించుకునేందుకు ఘోస్టింగ్ ఆశ్రయం
- థెరపీ ద్వారా మార్పు సాధ్యమని వెల్లడి
ఏంటీ ‘పఫర్ ఫిషింగ్’?
డేటింగ్లో భాగస్వామి ప్రవర్తించే ఒక వింత ధోరణిని సూచించడానికి మానసిక నిపుణులు ఈ పేరు పెట్టారు. సాధారణంగా ‘పఫర్ ఫిష్’ అనే చేప తనకు ఏదైనా ప్రమాదం పొంచి ఉందని అనిపించినప్పుడు.. తనను తాను రక్షించుకోవడానికి శరీరాన్ని ఒక ముళ్ల బంతిలా మార్చుకుని, దూరంగా జరుగుతుంది. డేటింగ్లో కూడా కొందరు వ్యక్తులు సరిగ్గా ఇలాగే ప్రవర్తిస్తారు. ఇద్దరి మధ్య బంధం బలపడుతున్నప్పుడు, విషయం పెళ్లి లేదా ‘సీరియస్ రిలేషన్షిప్’ వైపు వెళ్తున్నప్పుడు.. వారు ఒక్కసారిగా మానసికంగా దూరమవ్వడం లేదా ఎలాంటి కారణం లేకుండా బ్రేకప్ చెప్పి పారిపోవడాన్ని ‘పఫర్ ఫిషింగ్’ అంటారు.
ఈ లక్షణాలు ఉంటే..
- బంధం మొదలైన కొత్తలో వీరు ఎంతో కేరింగ్‌గా, అమితమైన ప్రేమను కురిపిస్తూ ప్రాణమిచ్చేలా నటిస్తారు.
- ఎప్పుడైతే బంధం క్యాజువల్ కెమిస్ట్రీ నుంచి నిజమైన ఎమోషనల్ బాండింగ్ వైపు మళ్లుతుందో.. అప్పుడు వారిలో భయం మొదలవుతుంది. ఒక క్షణం దగ్గరగా ఉంటూనే, మరుసటి క్షణమే ఊపిరాడనంతగా ఫీలవుతూ దూరంగా జరిగిపోతారు.
- రిలేషన్ సీరియస్ అవుతున్న కొద్దీ భాగస్వామిలోని చిన్న లోపాలను పెద్దవిగా చేస్తూ గొడవలు పడటం స్టార్ట్ చేస్తారు. కఠినమైన లేదా నిజాయతీతో కూడిన సంభాషణలు వస్తే చాలు.. సమాధానం చెప్పకుండా తప్పించుకుంటారు.
- చెప్పాపెట్టకుండా ఫోన్ నంబర్లు బ్లాక్ చేసి మాయమైపోతారు. మళ్లీ కొన్ని రోజుల తర్వాత ఏమీ తెలియనట్టు వచ్చి పాత బంధాన్ని అక్కడి నుంచే కొనసాగించాలని చూస్తారు.
ఇలా ఎందుకు ప్రవర్తిస్తారు?
రిలేషన్షిప్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చిన్నతనంలో వారి కుటుంబ వాతావరణం సరిగా లేకపోవడం లేదా గతంలో ప్రేమ పేరుతో మోసపోవడం వల్ల వీరు ఇలా తయారవుతారు. బంధంలో లోతు పెరిగితే అవతలి వారు ఎక్కడ తమను కంట్రోల్ చేస్తారోనని లేదా మళ్లీ ఎక్కడ మోసపోతామోననే భయం వారిని వెంటాడుతుంది. అయితే స్పేస్ కోరుకునే ప్రతి ఒక్కరూ పఫర్ ఫిష్ కాదని, సరైన కమ్యూనికేషన్ లేకుండా తరచూ పారిపోయే వారిని మాత్రమే ఈ కేటగిరీలోకి చేర్చవచ్చని నిపుణులు చెబుతున్నారు. థెరపీ, స్వీయ అవగాహన ద్వారా ఈ లోపాన్ని సరిదిద్దుకోవచ్చని సూచిస్తున్నారు.