తిరుమలలో తగ్గని రద్దీ.. పోటెత్తుతున్న భక్తులు
- క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లలో భక్తులు
- సర్వ దర్శనానికి 15 నుంచి 18 గంటల సమయం
- నిన్న శ్రీవారిని దర్శించుకున్న 95,152 మంది భక్తులు
తిరుమలలో కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. మరికొద్ది రోజుల్లో విద్యాసంస్థలు పునఃప్రారంభం కానుండటంతో, శ్రీవారికి మొక్కులు చెల్లించుకునేందుకు వస్తున్న భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఈ ఉదయం 7 గంటల సమయానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి, భక్తులు శిలాతోరణం వరకు క్యూలైన్లలో వేచి ఉన్నారు.
టీటీడీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 15 నుంచి 18 గంటల సమయం పడుతోంది. అదేవిధంగా టైమ్ స్లాట్ సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులకు స్వామివారి దర్శనానికి 4 నుంచి 6 గంటల సమయం పడుతోంది.
ఇక నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 95,152 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 40,601 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల కానుకల ద్వారా స్వామివారి హుండీ ఆదాయం రూ.4.44 కోట్లు సమకూరింది. అలాగే నిన్న మొత్తం 4.21 లక్షల లడ్డూలను విక్రయించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.