నీది టెన్త్ పేపర్ కొట్టేసిన హిస్టరీ.. నాది స్టాన్‌ఫోర్డ్ హిస్టరీ: నారా లోకేశ్

  • మూడు అక్షరాల బ్రాండ్ సీబీఎన్ అన్న లోకేశ్
  • భవిష్యత్తును ముందుగానే చూసే లీడర్ చంద్రబాబు అని కితాబు
  • గొడ్డలి పార్టీ అంటే సైకోకి కోపం వచ్చిందట అని ఎద్దేవా
  • ఇకపై ప్రతి ఎన్నికలో మనమే గెలవాలని పార్టీ శ్రేణులకు పిలుపు
  • డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ మన బలమని వ్యాఖ్య
తెలుగుదేశం పార్టీ పండుగలా జరుపుకునే మహానాడు వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో హైబ్రిడ్ మోడల్ లో వేడుకలు కొనసాగుతున్నాయి. వేడుకల సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ మాట్లాడుతూ పార్టీ అధినేత చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురిపించారు. విజనరీ లీడర్ సీబీఎన్ అని కొనియాడారు. 

"ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా మూడు అక్షరాలు చెబితే గౌరవం దక్కుతుంది. ఆ మూడు అక్షరాల బ్రాండ్ సీబీఎన్. ఈ సౌండ్ తాడేపల్లి ప్యాలస్‌కు వినపడాలి.. టీమ్ 11 టీవీలో మహానాడు చూస్తుంది. ఒక్కరితో అయితే పోటీ పడగలం. కానీ ఆయనలో 25 ఏళ్ళ కుర్రాళ్లు ముగ్గురు ఉన్నారు. ఆయన జెట్ స్పీడ్‌లో వెళుతుంటారు. ఆయన స్పీడ్ అందుకోవడానికి మనం కష్టపడుతున్నాం. అప్పుడు కియా... ఇప్పుడు ఫైటర్ జెట్స్. అప్పుడు ఐటీ.. ఇప్పుడు ఏఐ. అప్పుడు హైటెక్ సిటీ.. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ. అప్పుడు సైబరాబాద్... ఇప్పుడు అమరావతి. భవిష్యత్తును ముందుగానే చూసే విజనరీ మన లీడర్ సీబీఎన్. 

స్త్రీశక్తిని మహా శక్తిగా మార్చింది, మహిళలకు విద్య, ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది, డ్వాక్రా ద్వారా మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం ఇచ్చింది, తన తల్లి పడిన కష్టం మరే తల్లి పడకూడదని దీపం పథకం ప్రవేశపెట్టింది, మహిళలను బస్ కండక్టర్స్ చేసింది మన సీబీఎన్. దేశంలోనే మొదటి మహిళా స్పీకర్‌గా ప్రతిభా భారతిని నియమించింది మన సీబీఎన్. ఎవరైనా మహిళల జోలికి వస్తే అదే వారికి లాస్ట్ డేట్ అని చెప్పిన దమ్మున్న నాయకుడు మన సీబీఎన్" అని లోకేశ్ ఉద్ఘాటించారు.

తెలుగుదేశంలో కార్యకర్తే అధినేత అని లోకేశ్ అన్నారు.. 2019 నుంచి 2024 వరకు పసుపు సైన్యం చేసిన పోరాటం ఒక చరిత్ర. మనం కొట్టిన దెబ్బకి వై నాట్ 175 కాస్తా టీమ్ 11 అయిందని ఎద్దేవా చేశారు. ఒకే రాష్ట్రం – ఒకే రాజధాని – అభివృద్ధి వికేంద్రీకరణ మన విధానమని చెప్పారు. దేశవ్యాప్తంగా వచ్చే పెట్టుబడుల్లో ఈరోజు 25 శాతం ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నాయని తెలిపారు. గూగుల్, ఆర్సెలర్ మిట్టల్, ఫైటర్ జెట్ ప్రాజెక్టులు ఏపీకి క్యూకడుతున్నాయని చెప్పారు. 

"గొడ్డలి పార్టీ అంటే సైకోకి కోపం వచ్చింది అంట.  మాది గూగుల్ – మీది గొడ్డలి. మాది ఫైటర్ జెట్స్ – మీది ఫ్యాక్షన్. మాది కియా – మీది కిడ్నాప్. బాబాయిని చంపింది గొడ్డలితో కాదా? తల్లిని ఇంటి నుండి బయటకు గెంటింది నిజం కాదా? చెల్లికి అన్యాయం చేసి ఆస్తులు కొట్టేసింది నిజం కాదా? అందుకే గొడ్డలి పార్టీ అంటున్నాం" అని చెప్పారు.

"నిజం గడప దాటే లోగాని అబద్ధం ప్రపంచం చుట్టి వస్తుంది. బాబాయిని చంపి కత్తి బాబుగారి చేతిలో పెట్టారు. వైసీపీ ఫేక్ ప్రొపగాండాను గట్టిగా తిప్పికొట్టాలి. ఇప్పుడు రోజుకో కుట్రతో వస్తున్నారు. సైకో... నీది టెన్త్ క్లాస్ పేపర్ కొట్టేసిన హిస్టరీ ... నాది స్టాన్‌ఫోర్డ్ హిస్టరీ. టీచర్లను లిక్కర్ షాప్ ముందు నిలబెట్టిన హిస్టరీ నీది... టీచర్లను ట్రైనింగ్ కోసం సింగపూర్ పంపిన హిస్టరీ నాది. 5 సంవత్సరాల్లో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయని హిస్టరీ నీది ... 16,347 టీచర్ పోస్టులు ఒక్కసారిగా భర్తీ చేసిన హిస్టరీ నాది. జాబ్ క్యాలెండర్ అని సాక్షి క్యాలెండర్ చేతిలో పెట్టిన హిస్టరీ నీది ... 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన హిస్టరీ నాది" అని జగన్ ను ఉద్దేశించి లోకేశ్ ఎద్దేవా చేశారు.

ఇక నుంచి మనం గేర్ మార్చాలని, మిషన్ మోడ్‌లో పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి ఎన్నికలోనూ మనమే గెలవాలి, అదే మన గోల్ అని చెప్పారు. "ప్రజల్లోకి వెళదాం. త్వ‌రలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. అహంకారం వద్దు. అహంకారం చూపిన వారికి 151 కాస్తా 11 అవడం చూశాం. ప్రజలకు సేవ చేయడం మన ధ్యేయం. మనం అనుకున్నది సాధించాలంటే ప్రభుత్వ కొనసాగింపు ముఖ్యం. ఒకే ప్రభుత్వం ఉండటం వల్లే గుజరాత్, ఒడిశా రాష్ట్రాలు అభివృద్ధి సాధించాయి. డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ మన బలం. మనకు నమో ఉన్నారు. నమో అంటే నాయుడు-మోదీ. వీరిద్దరితో కలిసి పవనన్న కాంబోతో పోలవరం, విశాఖ రైల్వే జోన్, విశాఖ ఉక్కు, అమరావతి, కర్నూల్ హైకోర్టు బెంచ్ సాధించాం" అని లోకేష్ పేర్కొన్నారు.

Nara Lokesh
Mahanadu
Chandrababu Naidu
TDP
Andhra Pradesh
YS Jagan
Telugu Desam Party
AP Politics
Election

More Telugu News